‘గూడు’ చెదురుతోంది..!
దిశ, తెలంగాణ బ్యూరో: పేదల ‘గూడు’ చెదురుతోంది.. గోడు పట్టించుకునే వారు లేక గుండెలు పగులుతున్నాయి.. సర్కార్ ప్రతిష్టాత్మక పథకంలో డబుల్ బెడ్రూం ఇల్లు దక్కుతుందో లేదోనని అసలు లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.. సరైన మార్గనిర్దేశం, జవాబుదారీ తనం లేని యంత్రాంగం.., విచ్చలవిడిగా చొచ్చుకుపోయిన రాజకీయ జోక్యం.., శాఖల మధ్య సమన్వయ లోపం.., ప్రతిపాదనలు, పట్టింపులేని ప్రభుత్వ శైలి.., ఇలా అన్నీ కలిసి పేదల సొంతింటి కలను కల్లగా మారుస్తున్నాయి.. కుప్పులు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులో అసలువెన్నీ.. […]
దిశ, తెలంగాణ బ్యూరో: పేదల ‘గూడు’ చెదురుతోంది.. గోడు పట్టించుకునే వారు లేక గుండెలు పగులుతున్నాయి.. సర్కార్ ప్రతిష్టాత్మక పథకంలో డబుల్ బెడ్రూం ఇల్లు దక్కుతుందో లేదోనని అసలు లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.. సరైన మార్గనిర్దేశం, జవాబుదారీ తనం లేని యంత్రాంగం.., విచ్చలవిడిగా చొచ్చుకుపోయిన రాజకీయ జోక్యం.., శాఖల మధ్య సమన్వయ లోపం.., ప్రతిపాదనలు, పట్టింపులేని ప్రభుత్వ శైలి.., ఇలా అన్నీ కలిసి పేదల సొంతింటి కలను కల్లగా మారుస్తున్నాయి.. కుప్పులు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులో అసలువెన్నీ.. అయినవారివెన్నీ..? అక్కర ఉన్నవారెందరూ..? అవసరం లేనివారెందరూ..? వంటి విషయాలేమీ పట్టించుకోకుండా, లక్కీడ్రా పేరుతో పంపకాలు చేపట్టడంతో నిరుపేదలు డీలా పడుతున్నారు. చీటీలో పేరు రాకుంటే ఇక అంతే సంగతులా అని నిజమైన లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.. అడ్డదిడ్డంగా ఫిల్టరింగ్ చేస్తూ, అనుయాయులకు కేటాయింపులు చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యవహార సరళిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా ఎదురుచూపు..
జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించినా ఆరేండ్లలో 3,500 ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేసినట్టు కాంగ్రెస్ పరిశీలనలో నిరూపితమైంది. ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు అమలుకు సంబంధించిన నిర్దిష్ట ఉత్తర్వులు విడుదల చేయకపోవడం గమనార్హం. పథకం మొత్తంగా ప్రభుత్వ నేతల ఇష్టానుసారంగా సాగుతుండడంతో ఏళ్లుగా పేదలు ఇంటికోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
దరఖాస్తుల స్వీకరణలోనూ..
ఇళ్ల దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గ నిర్దేశకాలు లేవనే ఆరోపనలున్నాయి. పేదలెవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చని అనడంతో ఒకే ఇంటి నుంచి నాలుగైదు అప్లికేషన్స్ అందాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 3.70 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారికంగా ధ్రువీకరిస్తుండగా, అసలైతే ఆరు లక్షలకు పైగా వచ్చినట్టు సమాచారం. ఇంకా పెరుగుతుండడంతో తీసుకోవడానికి అధికారులు నిరాకరిస్తూ మీసేవా ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆదాయం సమర్పించాలని కోరినా ఎంత ఆదాయం అనేది పేర్కొన లేదు. పైగా, నిజమైన అర్హులను గుర్తించేందుకు సరైన ఫిల్టరింగ్ వ్యవస్థ లేకపోవడంతో పథకంపై స్పష్టత లేకుండా పోయింది.
శాఖ మధ్య సమన్వయ లోపం..
దరఖాస్తుల స్వీకరణ, ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక చేసే వ్యవస్థల మధ్య సమన్వయం కుదరకపోవడం కూడా సమస్య జఠిలమవడానికి కారణమైంది. గ్రేటర్ పరిధిలో ఒక్కో అంశం ఒక్కో శాఖ ఆధీనంలో ఉండటంతో పొంతన కుదరడం లేదు. దరఖాస్తులను ప్రారంభంలో హౌజింగ్ బోర్డు అధికారులు తీసుకోగా, తర్వాత కలెక్టరేట్లు, మీసేవా కేంద్రాల ద్వారా స్వీకరించారు. నిర్మాణాలు హౌజింగ్ శాఖ చేపట్టింది. దరఖాస్తుదారుల వివరాలు కలెక్టర్లు జీహెచ్ఎంసీకి పంపిస్తే లబ్ధిదారుల షార్ట్ లిస్టును మళ్లీ కలెక్టరేట్లకు పంపిస్తారు. ఇలా వ్యవహారం గందరగోళంగా మారడంతో పేదలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలు లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు.
రాజకీయ జోక్యంతో..
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం పెరగడంతో నష్టపోతున్నామని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 1: 6 నిష్పత్తిలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో లక్కీ డ్రాలో కేటాయింపులు చేస్తుండడంతో తమ పేరు రాకుంటే ఇల్లు కోల్పోయే అవకాశముందని వాపోతున్నారు. డ్రా తీస్తున్నామని చెబుతున్నా వాస్తవంలో అధికార పార్టీ నాయకులు, రాజకీయ సంబంధాలు ఉన్న వారికే కేటాయింపు జరుగుతున్నాయని పలు సందర్భాల్లో ఇప్పటికే నిరూపిమవడంతో పేదలు మరింత ఆందోళన చ చెందుతున్నారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న లక్ష ఇండ్లలో సుమారు 75 శాతం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తేల్చింది. జిల్లాలోనూ, జీహెచ్ఎంసీలో అవే ఇండ్లను చూయించి అధికార పార్టీ ప్రచారం చేసుకుంటుండటంతో రెండు ప్రాంతాల్లోని పేదలు ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొసమెరుపేంటంటే డబుల్ ఇండ్ల నిర్మాణాల కోసం భూమి ఇచ్చిన 8,848 మందికి కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఇళ్ల ఇవ్వలేదు.