అప్పుల్లో ఏపీ టాప్​.. రుణాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలు

 దిశ, ఏపీ బ్యూరో: రైతే దేశానికి వెన్నెముక.. రైతు లేనిదే దేశం లేదు. రైతే రాజు..ఇలా ఎన్ని నినాదాలు ఉన్న‌ప్ప‌టికీ రైతు బ‌తుకు మాత్రం మార‌డం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు. రైతుల పాలిట ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు సైతం మారుతున్నాయి. కానీ అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా రైతుల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంటోంది. రైతులను లక్షాధికారులను చేస్తామంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవన్నీ ఉత్తమాటలేనని తేలిపోయింది. కేంద్రం నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన […]

Update: 2021-12-05 23:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: రైతే దేశానికి వెన్నెముక.. రైతు లేనిదే దేశం లేదు. రైతే రాజు..ఇలా ఎన్ని నినాదాలు ఉన్న‌ప్ప‌టికీ రైతు బ‌తుకు మాత్రం మార‌డం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు. రైతుల పాలిట ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు సైతం మారుతున్నాయి. కానీ అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా రైతుల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంటోంది. రైతులను లక్షాధికారులను చేస్తామంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవన్నీ ఉత్తమాటలేనని తేలిపోయింది. కేంద్రం నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని సుమారు 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని వెల్లడించింది. ఇక రెండో స్థానంలో తెలంగాణ 91.7 ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (69.9 శాతం), కర్ణాటక (67.7 శాతం), తమిళనాడు (65.1 శాతం), ఒడిశా (61.2 శాతం), మహారాష్ట్ర (54 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నివేదిక చూస్తుంటే రైతు రాజు అవ్వడం ఏమో గానీ ఈ అప్పుల ఊబి నుంచి ఎప్పుడు బయటపడతాడా అన్న చర్చ జరుగుతుంది.

రైతు కుటుంబాల పరిస్థితి దయనీయం..

దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయినట్లు జాతీయ గణాంక కార్యాలయం సర్వే తెలిపింది. గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ, భూమి, పశువుల, గృహాల పరిస్థితిపై కేంద్రం ఇటీవల చేపట్టిన సర్వేలో రాష్ట్రంలోని రైతు కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వెల్లడైంది. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో అన్నదాతలు.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినట్టు సర్వే తేల్చింది. 50 శాతం కుటుంబాల్లో సరాసరి రూ.74,121 చొప్పున అప్పు ఉంది. వీరిలో 69.6% మంది బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు తీసుకోగా, 205% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం 57.5% రైతు కుటుంబాలు అప్పులు తీసుకున్నారు. 2019, జనవరి- డిసెంబరు మధ్య అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టినట్టు ఎన్‌ఎస్‌వో తన నివేదికలో స్పష్టం చేసింది.

ఒక్కో కుటుంబంపై రూ.2,45,554 అప్పు..

రాష్ట్రంలో 93.2% రైతు కుటుంబాలు రుణ ఊబిలోనే ఉన్న సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో సగటున 57% పెరిగిన కర్షకుల అప్పులు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2,45,554, దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు రూ.74,121కి చేరింది. 2013 నాటి రూ.47 వేలతో పోలిస్తే ఇది 57% అధికం. అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51.9% నుంచి 50.2%కి తగ్గినా, సగటు అప్పు మాత్రం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తాజా సర్వే నివేదిక తేల్చింది. సగటున ఒక్కో రైతు కుటుంబంపై అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో కేరళ (రూ.2,42,482), పంజాబ్‌ (రూ.2,03,249) ఉన్నాయి.

వడ్డీలు కట్టలేకపోతున్న రైతులు..

దేశంలో సగటున 69.6% రైతు కుటుంబాలకు సంస్థాగత రుణాలు అందుతుండగా.. ఇలాంటి రుణాలు ఏపీలో 49.6% మందికే అందాయి. ఫలితంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థి నెలకొంది. రాష్ట్రంలో వ్యవసాయ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నవారు 31.1% ఉండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవారు 15.4% మంది ఉన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5% కుటుంబాలకు రుణాలు అందుతుండగా, ఏపీలో అది 34.1%, తెలంగాణలో 24.8%కే పరిమితమైంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల్లో కేవలం 57.5% మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఏపీలో 60.3% మొత్తాన్ని వ్యవసాయం కోసమే ఉయోగిస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం అత్యధిక అప్పుల్లో కూరుకుపోయింది దక్షిణాది రైతు కుటుంబాలే. జాతీయ సగటు అప్పు రూ.74,121తో పోలిస్తే ఏపీలోని ఒక్కో కుటుంబంపై 221% అధిక అప్పు ఉంది.

కేంద్ర నివేదిక చెప్పిన అంశాలివే..

రైతు గృహాలపై సగటు ఆదాయాలు, అప్పుల భారం వివరాలు తెలపాలని ఎంపీ నదిముల్ హక్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటు సమావేశాల్లో బదులిచ్చారు. గత ఐదేళ్లలో దేశంలో నెలకు సరాసరి రైతు ఆదాయం రూ.10,218గా ఉన్నట్లు వెల్లడించారు. 2012-13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు 92.9 శాతం అప్పుల్లో కూరుకుపోయారు. దేశంలో అత్యధికంగా రైతులు అప్పుల్లో ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా మేఘాలయలో 2.4 శాతం ఉంది. 2018-19 కి గానూ 0.3 శాతం పెరిగి 93.2 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. నాగాలాండ్ లో 6.0 శాతంగా ఉంది. మరోవైపు బకాయిపడ్డ రుణాల్లోనూ రూ.1,69,322 కోట్లతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. దాదాపు 1,20,08,351 అకౌంట్లు బకాయిపడ్డాయని నివేదికలో పేర్కొంది. 2018 -2019 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,480 గా ఉందని తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక నెలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మేఘాలయ రూ.29,348 తో మొదటి స్థానంలో, జార్ఖండ్ రూ.4,895తో చివరి స్థానంలో ఉన్నాయి.

సంపాదన కంటే పెట్టుబడికే ఖర్చు ఎక్కువ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు నెలకు రూ. 10,480 రూపాయలు సంపాదిస్తుంటే ఖర్చు మాత్రం అంతకు మించి ఉంది. నెలవారీగా పంటలపై రూ. 8,847 రూపాయలు, పశుపోషణపై రూ.3,072 ఖర్చు చేస్తున్నారు. అంటే మెుత్తం ఖర్చు రూ. 11,922 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే రూ. 1,442 అదనంగా ఖర్చు అవుతుంది. ఇలా 12 నెలలకు సంబంధించి రూ. 17,304 రూపాయలు ఖర్చు అవుతుంది.

గొప్పలకే పరిమితమైన ప్రభుత్వ పథకాలు..

రైతుల కోసం ఎన్నో చేస్తున్నామ‌ని ప్రభుత్వాలు గొప్ప‌లు చెప్పుకుంటున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. రైతును రాజును చేస్తాం.. లక్షాధికారిని చేస్తాం అంటూ ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. కానీ ఆ పథకాలేవీ రైతును మాత్రం అప్పుల ఊబిలో నుంచి బ‌య‌ట‌కు తీసుకు రాలేక‌పోతున్నాయి. ఎన్ని ప‌థ‌కాలు తీసుకొచ్చినా అవి రైతు ఆర్థిక ప‌రిస్థితిని మాత్రం మెరుగు ప‌ర్చ‌లేక‌ పోతున్నాయి. ప్రభుత్వాలు ఓట్లు కురిపించే సంక్షేమ ప‌థ‌కాల‌నే ప‌ట్టుకొని వేలాడ‌కుండా.. ఎలాంటి పథకాలు అమలు చేస్తే… ఎలాంటి కార్యాచరణతో రైతు సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డతాడు అనే అంశంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతన్నకు ఆర్థిక చేయూత కోసం దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టినప్పుడు రైతు రాజు కాకపోయినా కనీసం అప్పుల నుంచి బయటపడతాడనేది వాస్తవం.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుకు నోచుకొనేనా?

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దుక్కి దున్నిన నాటి నుంచి పంట చేతికొచ్చే వ‌రకు రైతులు పొలంపై పెట్టే పెట్టుబ‌డులు విప‌రీతంగా పెరిగిపోయాయి. విత్త‌నాల నుంచి ఎరువులు, పురుగు మందుల ధ‌ర‌లు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు కూలీల కొర‌త కూడా అధికంగా ఉండటంతో అధిక కూలి వెచ్చించి మరీ పనులు చేయించుకోవాల్సి వస్తోంది. ఇంత కష్టపడినా పండించిన పంటకు మ‌ద్ద‌తు ధ‌ర‌ లభించడం లేదు. పెట్టుబ‌డికి 50 శాతం అదనంగా క‌లిపి మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని చెప్పిన స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార్సులను ఏ ప్రభుత్వాలూ అమలు చేయడం లేదు సరికదా కనీసం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఫలితంగా రైతు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.

ఒకానొక సందర్భంలో పెట్టుబడికి తెచ్చిన వడ్డీలు కట్టేందుకు కూడా రాబడి రావడం లేదు. ఇదిలా ఉంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతన్న నడ్డి విరిస్తున్నాయి. అకాల వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు రైతులను మ‌రింత అగాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ అకాల వ‌ర్షాల వ‌ల్ల కొన్నిసార్లు పొలంలో ఉన్న మొక్క‌లు చ‌నిపోతున్నాయి. కొన్ని సార్లు క‌ల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోవ‌డం, త‌డిసిపోవ‌డం..మెులకలు రావడం జరుగుతున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఇంకోసారి స‌మ‌యానికి వ‌ర్షం ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా పంటలు స‌రిగా పండ‌టం లేదు. దీంతో రైతుల‌కు గిట్టుబాటుకావ‌డం లేదు. ప్ర‌తీ ఏటా అప్పుల్లో మునిగిపోతున్న రైతు మాత్రం వ్య‌వసాయం చేయ‌డం ఆప‌డం లేదు. కొత్త అప్పులు తీసుకొచ్చి మ‌రీ పంటపై పెట్టుబ‌డి పెడుతున్నాడు. కాలం క‌లిసిరాని సంద‌ర్భంలో మ‌రింత అప్పుల్లోకి దిగ‌జారుతున్నాడు. ఈ అప్పులు బాధలు భరించలేని అన్నదాత చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.

Tags:    

Similar News