జగన్ ప్రభుత్వ సహాకారంతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: శైలజానాథ్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించొద్దంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ఆంధ్రా పీసీసీ చీఫ్ శైలజానాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిలిపివేయాలని అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన హోదా ఇంతవరకే ఇవ్వలేదని.. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రత్యేక […]
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించొద్దంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ఆంధ్రా పీసీసీ చీఫ్ శైలజానాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిలిపివేయాలని అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన హోదా ఇంతవరకే ఇవ్వలేదని.. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తారా అంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని శైలజానాథ్ ప్రశ్నించారు. జగన్ ఇంకెంత కాలం మోడీ కాళ్లు పట్టుకుని పాలన చేస్తారని నిలదీశారు. జగన్ కి మోడీ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టాల్సిన బాధ్యత సీఎం జగన్ కు లేదా అని నిలదీశారు.
వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ విషయాలపై పోరాడాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై అన్ని పక్షాలను కలుపుకుని ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర వ్యవహరిస్తున్న విధానాలను పరిశీలిస్తే.. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. దేశ ఆస్తులను అమ్మే హక్కు మోడీకి లేదన్నారు. మోడీని పార్లమెంట్ లో నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నష్టంలో ఉన్న వాటిని అమ్మేస్తాం అని కేంద్రం అనడాన్ని తప్పుబట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉక్కు పరిశ్రమకి నాలుగు వేల కోట్లు కేటాయించారు. మరి మోదీ ప్రభుత్వం ఏం కేటాయించిందని ప్రశ్నించారు. నాగ్ పూర్ ఆర్.ఎస్.ఎస్ ఆర్ధిక విధానం కేంద్రం అవలంబిస్తుందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ భారత ఆస్తులను అమ్మే ప్రక్రియను వ్యతిరేకిస్తోందని శైలజానాథ్ తెలిపారు. తమ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను ఆపాలి .. ప్రత్యేక హోదా సాధించాలి.. రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి సాధించాలి అనే నినాదంతో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వీధుల్లో పోరాటం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. కేంద్రానికి అన్ని విషయాల్లో వైసీపీ నేతలు దాసులయ్యారని.. అలాంటిది పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ నేతలు ఆపలేరా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రావాల్సిన అన్ని హామీలను సాధించే దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేయాలని శైలజానాథ్ హితవు పలికారు.