సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ రియాక్షన్ ఇదే.. ఫైర్ బ్రాండ్ ఏమన్నారంటే..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయడంపై వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీతో నిజానిజాలు తేలుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Update: 2024-10-04 08:53 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. విచారణకు అది ఒక్కటే సరిపోదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు (supreme court). లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై వైఎస్సార్సీపీ అధిష్టానం ఆనందం వ్యక్తం చేసింది. లడ్డూ పై విచారణకు సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతిస్తున్నట్లు వైసీపీ పేర్కొంది. పిటిషనర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం వేసి స్వతంత్ర కమిటీతో న్యాయం జరగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కమిటీ నిష్పాక్షికంగా విచారణ చేసి.. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదన్న నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నామని, అదే తమకు అసలైన సంతృప్తిని ఇస్తుందన్నారు.

అలాగే వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్కే రోజా ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇకనైనా శ్రీవారి లడ్డూ (Tirumala Laddu Row) ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశ పూరిత వ్యాఖ్యల్ని మానుకుంటే మంచిదన్నారు. "మొదటి నుంచి మేము భావిస్తున్న‌ది రాష్ట్ర ముఖ్య‌మంత్రే విచార‌ణ‌, ఆధారాల‌తో సంబంధం లేకుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో వారి ప‌రిధిలోని విచార‌ణ‌తో నిజాలు బ‌య‌టికి రావ‌ని స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కావాల‌ని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ స‌రిపోద‌ని , కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాల‌నే వాద‌న‌తో మా డిమాండ్‌కు విశ్వ‌స‌నీయ‌త పెరిగింది. సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్వ‌తంత్ర ద‌ర్యాప్తుతో వాస్త‌వాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని, త‌ద్వారా గాయ‌ప‌డిన కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని పున‌రుద్ధరించిన‌ట్టు అవుతుంద‌ని తిరుప‌తి ఆడ‌బిడ్డ‌గా న‌మ్ముతున్నాను" అని రోజా ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 


Similar News