AP:ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, కడప: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని వీరభద్ర స్వామి గుడి సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ లతో కలిసి మూడవ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచడంతో పాటు ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి నెల మూడవ శనివారం జరిగే స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అన్నమయ్య జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి అన్నమయ్య జిల్లాకు ప్లాస్టిక్ రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.