రుణాలకు బ్రేక్.. రైతులకు షాక్

అన్నదాతల బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ ఏడాది రైతు రుణాలకు బ్రేక్ వేసింది. ...

Update: 2024-09-15 02:23 GMT

దిశ ప్రతినిధి, కడప: అన్నదాతల బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ ఏడాది రైతు రుణాలకు బ్రేక్ వేసింది. రుణాలు ఇవ్వడం కాకుండా రికవరీలపై దృష్టి పెట్టి ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో ఆ బ్యాంకు శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. రుణ గ్రహీతల నుంచి రికవరీ ద్వారా బ్యాంక్ ఆర్థిక పరిపుష్టిని సాధించాలనే‌ సంకల్పంతో ఆ బ్యాంకు ఉన్నా ప్రతి ఏడాది లాగే ఈ ఏడు కూడా కొత్త రుణాలు ఇవ్వకపోవడం రైతులకు నిరాశ మిగుల్చుతోంది.

బకాయిల వసూలే లక్ష్యంగా..

దశాబ్దాల నుంచి పేరుకుపోయిన బకాయిలతో పాటు, ఇటీవల కాలంలోని బకాయిలు సుమారు రూ.3,157 కోట్లను రికవరీ చేయడం బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, రిటైల్ రుణాలుగా విభజించి 2024- 25 సంవత్సరంలో తలపెట్టిన లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంతో బాంక్ ముందుకు సాగుతోంది. ఇంటర్నల్ చెక్ అండ్ కంట్రోల్‌పై దృష్టి సారించింది. ఇటువంటి ప్రయోగం ద్వారా సాధించే లక్ష్యాన్ని బట్టి ఆర్థిక పరిపుష్టిని నింపుకోవాలనే యోచనలో ఉన్న బ్యాంక్ ఈ మేరకు వసూళ్ళకే ప్రాధాన్యం ఇస్తోంది.

భారీ కసరత్తు ..

ఉమ్మడి కడప జిల్లాలో 71 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో దశాబ్ధాల తరబడి ఇప్పటివరకు పేరుకుపోయిన 3157 కోట్ల రుణాలను వంద శాతం రికవరీ చేయాలన్న కసరత్తు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికలకు సంబంధించి ఆశించిన మేరకు రికవరీ చేసి ఏడాది చివరి నాటికి వందశాతం రికవరీ చేయాలనే దిశగా ముందుకు సాగుతోంది. గతేడాది డిసిసిబి సరికొత్త ఆలోచనతో డిపాజిట్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో విద్యార్థులను సైతం పొదుపు దిశగా ప్రేరేపించి భాగస్వామ్యం చేసి డిపాజిట్ల శాతాన్ని పెంచుతూ వచ్చింది.

ప్రత్యేక బృందాలతో డ్రైవ్ ..

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాల వసూళ్ళ కోసం ప్రత్యేక బృందాలతో డ్రైవ్ చేపట్టింది. 8 మంది నోడల్ ఆఫీసర్లను పర్యవేక్షణకు నియమించింది. ఒక్కో బృందానికి పది మంది చొప్పున డిసిసిబి అధికారులు, ఉద్యోగుల్ని నియమించింది. వీటికి జిల్లా నోడల్ ఆఫీసర్లు బాధ్యులుగా ఉంటారు. ఈ బృందానికి రోజువారి లక్ష్యాన్ని నిర్ణయించి ఈ లెక్కన ఉమ్మడి కడప జిల్లాలోని 24 బ్రాంచిల్లో రికవరీ డ్రైవ్‌ను వేగవంతంగా చేపడుతోంది. బ్యాంక్ సీఈవో రాజామణి మాట్లాడుతూ బకాయిల వసూళ్లలో ఆశించిన మేరకు పురోగతిని సాధించామని, ఏడాది చివరి నాటికి పూర్తి లక్ష్యాన్ని సాధించి ఆ తర్వాత పంట రుణాలకు కూడా ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.


Similar News