బొప్పాయి రైతుకు దళారుల కుచ్చుటోపీ

భారీవర్షాలు, దళారుల దెబ్బకు బొప్పాయి రైతులు ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

Update: 2024-10-16 04:25 GMT

దిశ, ప్రతినిధి కడప: ఆరుగాలం కష్టించి బొప్పాయి సాగు చేస్తున్న రైతన్నకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టి లేక దళారులు, మార్వాడీ సేఠ్లు ఇష్టారాజ్యంగా బొప్పాయి కొనుగోలు చేస్తుండటం, సూటుపేరుతో మోసం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని దళారుల ఆటకట్టించి తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

20 వేల హెక్టార్లలో సాగు ..

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో దాదాపుగా 20 వేల హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా రైల్వేకోడూరులోనే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటాదళారులు, మార్వాడీ సేఠ్లు అతి తక్కువ ధరకు బొప్పాయి కొనుగులు చేస్తుండడంతో రైతన్నకు గిట్టుబాటు కావడం లేదు. పైగా సూట్ పేరుతో 1000 కేజీలకు 100 కేజీలు రైతుల నుంచి బొప్పాయి బలవంతంగా తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ తంతు జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టార్జితం పరులపాలవుతోంది.

అక్కడ రూ.25 వేలు.. ఇక్కడ రూ.11 వేలు..

అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లాలో బొప్పాయి కేజీ రూ.25కు (టన్ను రూ.25 వేలు) కొనుగోలు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో స్థానిక వ్యాపారులు, దళారులు, మర్వాడీలు కుమ్మక్కై సిండికేట్‌గా ఏర్పడి బొప్పాయి కేజీ రూ.11కు (టన్ను రూ.11 వేలు) కొనుగోలు చేస్తున్నారు. కనీసం కేజీ రూ.25తో కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. పైగా సూట్ పేరుతో 1000 కేజీల బొప్పాయి విక్రయిస్తే, 100 కేజీల బొప్పాయిని బలవంతంగా దళారులు, స్థానిక వ్యాపారులు, మార్వాడీలు తీసుకుంటున్నారు.

జేసీ దృష్టికి సమస్య..

రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులను, దళారులు ధర తగ్గించి, సూట్ పేరుతో మోసం చేస్తున్నారని సీఐటీయు జిల్లా అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ నాయకత్వంలో రైతులు, అధికారులతో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర రాయచోటి, కలెక్టర్ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. పీలేరు, అనంతపురంలో, బొప్పాయి కేజీ రూ.25 పలుకుతుంటే, కోడూరులో మాత్రం నాణ్యమైన సరుకు కేజీ రూ.11కు కొనుగోలు చేస్తున్నారని రైతులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాపారస్తులు, దళారులను జాయింట్ కలెక్టర్ ఆహ్వానించినా హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా రైల్వే కోడూరులోనే, రాజంపేట సబ్ కలెక్టర్, డీఎస్పీ ఆధ్వర్యంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ ఏడీ త్యాగరాజును జేసీ ఆదేశించారు.


Similar News