YS వివేకా హత్య కేసులో అనూహ్య ట్విస్ట్.. సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-03-27 06:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. నత్తనడకన దర్యాప్తు సాగుతూ ఉన్నదని వ్యాఖ్యానించిన జస్టిస్ ఎమ్మార్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. వెంటనే ఇన్వెస్టిగేషన్ అధికారిని మార్చాలని, ఈ మేరకు సీబీఐ ఉన్నతాధికారులతో చర్చించాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ నిర్ణయం తీసుకోని పక్షంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంకా ఎంతకాలం ఈ దర్యాప్తును ఇదే తీరులో కొనసాగిస్తారని నిలదీసింది. ఇదే నిదానం ఇకపైన కూడా కొనసాగితే దోషులను గుర్తించడం, వారికి శిక్ష పడడం ఎప్పటికి సాధ్యమవుతుందని ప్రశ్నించింది.

ఈ కేసు విషయంలో సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదికను ఆద్యంతం చదివామని, దీని ఆధారంగా విచారణలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొన్నది. కేవలం రాజకీయ దురుద్దేశం అనే అంశాన్ని మాత్రమే స్టేటస్ రిపోర్టులో సీబీఐ పేర్కొన్నది, ఇంతకు మించి కేసుకు సంబంధించిన మెరిట్స్ కనిపించడంలేదని పేర్కొన్నది.

హత్యకు దారితీసిన ప్రధాన కారణాలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను బయటపెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారిని మార్చి ఆ స్థానంలో మరో ఆఫీసర్‌ను నియమించాలని ధర్మాసనం వ్యాఖ్యానించడంతో పాటు ఇప్పుడు ఉన్న అధికారి కూడా కంటిన్యూ అవుతారని స్పష్టత ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ సమయానికల్లా సీబీఐ ఉన్నతాధికారుల నుంచి డైరెక్షన్స్ తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Tags:    

Similar News