Ys Vijayamma: నా కుమారుడు జగన్‌పై దుష్ప్రచారం అత్యంత జుగుప్సాకరం

తన కారు ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ స్పందించారు..

Update: 2024-11-04 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ(YS Vijayamma) హత్యకు కుట్ర జరిగిందని, ఆమె కారుకు రోడ్డు ప్రమాదం జరగడంతో ఆమె భయపడి అమెరికా వెళ్లిపోయారని సోషల్ మీడియా(Social media)లో రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. టైర్లు ఊడిపోయి రోడ్డు పక్కన ఉన్న విజయమ్మ కారు ఫొటోలు వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వైఎస్ విజయమ్మ సోమవారం స్పందించారు. ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను ఎంతగానో కలచివేసిందని విజయమ్మ పేర్కొన్నారు. కొంతమంది లేనిపోని అసత్య కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇదంతా చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

తనను అడ్డం పెట్టుకుని నీచ, నికృష్ట రాజకీయలకు చేస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలను తాను ఖండించకపోతే ప్రజలు నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలను, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలు ప్రజలకు తెలియాలని స్వయంగా తానే స్పందించానని తెలిపారు. తన కారుకు ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని తన కుమారుడు వైఎస్ జగన్‌(YS Jagan)పై పెట్టి దుష్ర్పచారం చేయడం అత్యంత జుగుప్సాకరమన్నారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే దాన్ని సైతం తప్పుగా చిత్రకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భయపడి విదేశాలకు పారిపోయినట్లు దుష్ప్రచారం చేయడం అత్యంత నీతి మాలిన చర్య అని విజయమ్మ మండిపడ్డారు.


Similar News