లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రభుత్వంపై సుప్రీంకోర్టుప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు...
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Srivari Laddu Controversy)లో ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో కాంగ్రెస్(Congress) రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) స్పందించారు. లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు అని వైయస్ షర్మిల విమర్శించారు. లడ్డూ కల్తీ ఘటనపై CBIతో విచారించాలని తొలి నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ‘‘సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్. విచారణకు పనికిరాదు. CBIతోనే లోతైన విచారణ సాధ్యమవుతుంది. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. హిందువుల మనోభావాలను గౌరవిస్తే సుప్రీంకోర్టు సూచనలను కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.’’ వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
‘‘లడ్డూ అపవిత్రం ఎక్కడ, ఎలా జరిగింది?. దొంగలెవరు?. తక్కువ ధరకే ఎందుకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఎవరున్నారు?. NDDB రిపోర్ట్‌ను ఇంతకాలం దాచిపెట్టడానికి గల కారణాలెంటి?. మత రాజకీయాలకు చిచ్చు రేపింది ఎవరు?. ఇలాంటి సందేహాలకు సమాధానం దొరకాలి. నిందితులకు కఠిన శిక్ష పడాలి.’’ అని షర్మిల డిమాండ్ చేశారు.