దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలను సైతం తీసుకుంటున్నారు. వై నాట్ 175 అంటూ దూకుడు పెంచుతూనే పార్టీ నేతలను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు సర్వేలు చేపట్టి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారు.. పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అని నిర్మొహమాటంగా తేల్చి చెప్పేస్తు్న్నారు.
వైసీపీ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ అసమ్మతి తలనొప్పిగా ఉంటే దాన్ని సరిదిద్దేందుకు సైతం వెనుకాడటం లేదు. పదవి ఆశచూపో.. నామినేటెడ్ పదవులు కట్టబెట్టో వారి అసమ్మతికి ముకుతాడు వేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలో కొంతమంది అలాంటి వారు సైతం ఉన్న సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అసహనం..
2024 ఎన్నికల్లో గెలిస్తే మరో 20 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. అందుకు ఖచ్చితంగా కష్టపడాలి ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ మీటింగ్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాడర్‌కు చెప్తున్న మాట. అసమ్మతి ఉన్నా.. ప్రజల్లో అసంతృప్తి ఉన్నా టికెట్లు ఇచ్చేది లేదు అని ముఖం మీదే తేల్చి చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పార్టీలోని అంతర్గత విభేధాలపై ఫోకస్ పెట్టిన వైఎస్ జగన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇందులో ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని అసమ్మతిపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో మాజీమంత్రి పి. రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పొసగడం లేదని తెలుస్తోంది. మాజీమంత్రిని ఎమ్మెల్యే కనీసం గుర్తించడం లేదని.. ఆయన పనులు కూడా సక్రమంగా జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైసీపీలో పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాలుగా విడిపోయాయి.
బంధువు శేఖర్ రెడ్డి తిరుగుబాటు..
ఇకపోతే ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గంగవరం శేఖర్ రెడ్డి. ఈయన ఎమ్మెల్యేకు సమీప బంధువు సైతం. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం కష్టపడ్డారు. సుధీర్ రెడ్డి గెలుపొందిన రెండేళ్ల నుంచి ఇరువురు మధ్య పొసగడం లేదు. గంగవరం శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేకు దూరమయ్యారు. ఎమ్మెల్యేపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఎమ్మెల్యేని కాదని నియోజకవర్గంలో సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద తలనొప్పిగా మారారు.
అసమ్మతి నేతలు కార్యకర్తలను దగ్గరకు తీసుకుని ఒక వర్గాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇటీవలే గంగవరం శేఖర్‌రెడ్డి సొంతమండలమైన ఎర్రగుంట్లలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి అసమ్మతి నేతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.'పార్టీ కోసం పనిచేస్తాం. జగన్ ఏం చెబితే అది చేస్తాం. అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూనే ఎమ్మెల్యేపై అసహనాన్ని కుండబద్ధలు కొట్టారు.
మూడుముక్కలాట..
జమ్మలమడుగు వైసీపీలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, గంగవరం శేఖర్ రెడ్డిలు వర్గాలుగా విడిపోయారు. ఈ అంశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంపై పార్టీ నాయకత్వం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ముగ్గురుతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమావేశాలలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డివైపే అధిష్టానం ఉండటంతో నేతలకు మింగుడు పడటం లేదు.
ఎమ్మెల్యే తీరుపై అనేక మార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పరిస్థితిని చక్కబెట్టకపోవడంపై మండిపడుతున్నారు. దీంతో జమ్మలమడుగు వైసీపీలో అసమ్మతి రాగాలు పెరిగాయి. అయితే అధికార పార్టీలో వర్గపోరు, అసమ్మతిని ప్రతిపక్ష పార్టీ క్యాష్ చేసుకునే పనిలో పడిందట. ఈ విషయం తెలసుకున్న వైసీపీ అధిష్టానం పి.రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దీంతో కాస్త అసమ్మతిని తగ్గించినట్లు అయ్యింది. ఇకపోతే గంగవరం శేఖర్ రెడ్డిని సైతం బుజ్జగించడంతో శాంతించినట్లు తెలుస్తోంది.
సుధీర్ రెడ్డి సేఫ్ జోన్‌లో ఉన్నట్టేనా..?
పి. రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి పోటీ లేదని తేటతెల్లమైపోయింది. ఖచ్చితంగా రామసుబ్బారెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే సుధీర్ రెడ్డికి అనుకూలంగా పర్యటించాల్సిన పరిస్థితి. ఇకపోతే గంగవరం శేఖర్ రెడ్డి సైతం బుజ్జగింపులతో శాంతించినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుపై సర్వేలో మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో వెల్లడైందట. ఈ పరిణామాలతో సీఎం జగన్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసమ్మతి లేకుండా చేయడంతోపాటు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువ కావాలని ఆదేశించారట. వచ్చే సర్వేలో కూడా మిశ్రమ ఫలితాలు వస్తే టికెట్‌పై పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.