పవన్ కల్యాణ్ ప్రచార రథంపై వైసీపీ అభ్యంతరం

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఏ అంశం దొరికితే చాలు దాని కేంద్రంగా రాజకీయం చేయడానికి పార్టీలన్నీ రెడీ అయిపోతాయి.

Update: 2022-12-09 08:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఏ అంశం దొరికితే చాలు దాని కేంద్రంగా రాజకీయం చేయడానికి పార్టీలన్నీ రెడీ అయిపోతాయి. గతంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండాలోని రంగులు వేయడం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ రంగుల వివాదం ఏకంగా కోర్టుమెట్లెక్కడం కోర్టు సైతం వైసీపీకి నాడు మెుట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రంగుల వివాదం మరోసారి చెలరేగింది. అయితే అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే ఎన్నికల రథం వారాహి రంగు. ప్రచార రథం వారాహి రంగు ఆలివ్ గ్రీన్ రంగు పోలి ఉండటంతో అది నిషేధితమని వైసీపీ చెప్తోంది.

ఆ రంగుకు బదులు వేరే రంగు వేసుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు దత్తపుత్రుడు పెట్టిన దత్త పార్టీ కాబట్టి ఏకంగా పసుపు రంగు వేస్తే సరి అంటూ వైసీపీ సెటైర్లు వేస్తోంది. ఆలీవ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదని చట్టం చెబుతోందని వైసీపీ అంటుంటే నిబంధనలకు అనుగుణంగానే రంగులు వేసినట్లు జనసేన కౌంటర్ ఇస్తోంది. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజల ఆస్తులకు పార్టీ రంగులు వేసే వారి నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఆశించగలమంటూ ఎదురుదాడికి దిగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే.. నేను ఊపిరి తీసుకోవడం ఆపేయాలా..?? అంటూ ప్రశ్నించారు. దీంతో ఏపీ రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది. రంగులతో మెుదలైన వివాదం ఎటువైపునకు దారితీస్తోందనన్న ఉత్కంఠ ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో నెలకొంది.

అసలు వివాదం ఏంటంటే..?

ఇకపోతే జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి వారాహి వాహనం సిద్ధమైంది. ఈ వాహనాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే పరిశీలించారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఈ వాహనం ట్రయల్‌ రన్ కూడా పూర్తయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా విడుదల చేశారు. అయితే వారాహి కలర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప.. ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ ఉపయోగించకూడదని కార్నర్ చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమని కూడా వారాహిపై ట్రోల్ చేస్తున్నారు.

అయితే జనసైనికులు మాత్రం ఆలీవ్ గ్రీన్‌లో చాలా రంగులు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. అందులో కొన్నింటికి పర్మిషన్ ఉంటుందని.. తమ నాయకుడు నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే రంగులు వేయించారని చెప్పుకొచ్చారు. కొన్ని బుల్లెట్ బైక్‌లకు కూడా ఈ కలర్ ఉందని.. వారాహి వాహనం రంగుకు వచ్చిన ఇబ్బందేమి లేదని జనసేన క్లారిటీ ఇస్తోంది. ఇదే సందర్భంలో మాజీమంత్రి పేర్ని నానికి కౌంటర్ కూడా ఇస్తోంది. ఓనర్‌కి డ్రైవర్‌కి తేడా తెలియని మాజీమంత్రి పేర్ని నానికి ఆలివ్ గ్రీన్‌కి, గెలాక్టిక్ గ్రీన్‌కి, ఎమరాల్డ్ గ్రీన్‌కి తేడా ఏం తెలుస్తుంది అంటూ జనసైనికులు సెటైర్లు వేశారు.

ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివితే బాగుండేది : మాజీమంత్రి పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగు వేయడంపై మాజీమంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలివ్ గ్రీన్ రంగుకు బదులు వేరే ఏ రంగు కాకుండా పసుపు రంగు వేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగు వేయడం చట్టవిరుద్ధమని చెప్పుకొచ్చారు. ఆ రంగు, ఈ రంగు వేసే బదులు పసుపు రంగు వేసేసుకోవచ్చుకదా అంటూ ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు వేసిన ప్రైవేట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయరని చెప్పుకొచ్చారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పే పవన్ కల్యాణ్ ఇండియన్ మోటర్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని కూడా చదివితే బాగుండేదంటూ పంచ్‌లు వేశారు.

అంతేకాదు సినిమాల్లో మిలట్రీ దుస్తులు వేసుకుని సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికుల్ని కాల్చి చంపినట్లు నటించవచ్చని కానీ నిజ జీవితంలో అది అసాధ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న ప్రతి ఒక్కరు వ్యాన్లు కొనుక్కుని యుద్ధాలు చేస్తామంటే కుదరదన్నారు. పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ అయితే ఇవన్నీ తెలిసేవని కానీ కాల్‌షీట్‌ పొలిటిషియన్ కావడం... అందులోనూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ మినహా ఇంకేమీ తెలియడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగిపోలేదు విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు కాబట్టి సరిపోయిందని లేకపోతే ఎప్పుడో టీడీపీతో జతకట్టేసేవారని అయినా.. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ మాజీమంత్రి పేర్ని నాని జోస్యం చెప్పారు.

ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?: పవన్ కల్యాణ్

మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. 'ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారు. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు. మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్‌ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? ఆ తర్వాత అంటూ పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

READ MORE

ఏపీలో కొత్త ఆస్పత్రుల నిర్మాణంలో ఆలస్యమెందుకు : పార్లమెంట్ లో ఎంపీ జీవీఎల్‌ ప్రశ్న 

Tags:    

Similar News