Mp Vijayasai Reddy: పేదల తరపున పోరాటంలో ప్రభుత్వం విజయం
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరిగిన న్యాయపోరాటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధించిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు...
దిశ, ఏపీ బ్యూరో: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరిగిన న్యాయపోరాటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధించిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ విజయం పేదల విజయం అని ఆయన అభివర్ణించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ చేసిన కుట్రలు కుతంత్రాలు ఫలించలేదని అన్నారు.
గత ప్రభుత్వం రూ. 5లక్షలు ధర నిర్ణయించే టిడ్కో ఇళ్లు నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కేటగిరీల్లో టిడ్కో ఇళ్లు కేటాయిస్తున్నట్లు, ఉచితంగా ఇవ్వడం లేదని, 5 లక్షల రూపాయలు చెల్లించాలని పచ్చ పార్టీ ప్రచారం చేసిన దాంట్లో వాస్తవం లేదని అన్నారు. జగనన్న ఇళ్లు రెండు కేటగిరీల్లో అందిస్తున్నారని గ్రామాల్లో 653.4 చదరపు అడుగులు అనగా 1.5 సెంటు, పట్టణాల్లో 435.6 చదరపు అడుగులు అనగా 1 సెంటు విస్తీర్ణంలో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. అదే అసలు నిజమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.