‘ప్రాణం పోయేంత వరకు జగన్ వెంటే’.. పార్టీ మార్పుపై YCP ఎమ్మెల్యే క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 11 చోట్ల మాత్రమే
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 11 చోట్ల మాత్రమే విజయం సాధించి అధికారాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ చూడని అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని బాధలో ఉన్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై తాజాగా విశ్వేశ్వర రాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారం అంతా అవాస్తవమని కొట్టి పారేశారు. వైసీపీ అధినేత జగన్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. అలాంటి వ్యక్తిని తాను మోసం చేయనని స్పష్టం చేశారు. పొలిటికల్ కెరీర్‌లో ఎన్నోసార్లు అండగా నిలబడ్డ జగన్ వంటి వ్యక్తిని వదిలి వెళ్తే పుట్టగతులు ఉండవని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు తేల్చి చెప్పారు. వైసీపీని వీడి వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని ఈ ఐదేళ్లు ప్రజల మధ్య ఉండి మళ్లీ వైసీపీని అధికారంలోకి తేచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.