చంద్రబాబు ‘రా.. కదలిరా..’కు స్ట్రాంగ్ కౌంటర్
ఇలా చంద్రబాబు సభ అయిపోయిందో లేదో అలా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు....
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా..’ కార్యక్రమంలో ఎన్నికల శంఖారావం పూరింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ప్రారంభించారు. ఇలా సభ మొదలైందో లేదో అలా ప్రభుత్వంపై విమర్శలందుకున్నారు. అంతేకాదు సీఎం జగన్‌ను ఏకిపారేశారు. వైసీపీ ఇంచార్జులపైనా విమర్శల వర్షం కురిపించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపైనా విమర్శనాస్త్రాలు సంధించారు.
దీంతో వైసీపీ నేతలు కూడా కౌంటర్లకు దిగిపోయారు. ఇలా చంద్రబాబు సభ అయిపోయిందో లేదో అలా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. ఇక చంద్రబాబుపై ప్రతి విమర్శల దాడి మొదలు పెట్టారు. చంద్రబాబు‘రా.. కదలిరా..’ అన్నారని.. అసలు ప్రజలు ఎందుకు రావాలని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పేర్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ను విమర్శించడానికే‘రా.. కదలిరా’ ప్రోగ్రాం పెట్టారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలపై విమర్శలు చేశారు. ఇప్పుడు హామీలు ఇస్తున్నారని.. అధికారంలో ఉన్నప్పుడ ఏం చేశారని నిలదీశారు. 14 ఏళ్లలో ఎప్పుడూ కనిగిరి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎవరి ఆదాయం పెరిగింది.. ఏ వస్తువు రేటు తగ్గిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
‘జగన్ మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరుగుతోంది. నాలుగు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరగుతున్నాయి. సచివాలయాల నిర్మాణాలు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. ఐదేళ్లలో చాలా ప్రైవేటు పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తరలివచ్చాయి.’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక పేర్ని నాని విమర్శలకు టీడీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.