రాజకీయాలకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యే: పోటీ చేయనని తేల్చేసిన వసంత

ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈయన రూటే సెపరేట్.

Update: 2023-12-21 08:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈయన రూటే సెపరేట్. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అని అంటూ ఉంటారు. ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఈయన నైజం. అధినేత దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆయనకు నచ్చితే పొగడటం నచ్చకపోతే మెుహం మీదే విమర్శించడం ఆయనకు అలవాటు. ప్రజలకు సేవ చేయడంలో కూడా అంతే దూకుడుగా ఉంటారు. తన వంతు సాయం చేయాలనుకునే వారికి ఖచ్చితంగా సాయం చేసి తీరుతారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇక పంతానికి పోతే ఎవరిని సైతం లెక్కచేయరు. తండ్రిని సైతం వదిలించుకోవడానికి రెడీ అవుతుంటారు. ఏదైనా ముఖంమీద కుండబద్దలు కొట్టే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో వర్గపోరును తట్టుకోలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై దీర్ఘాలోచనలోకి వెళ్లారు. వైసీపీ అధిష్టానం టికెట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్న తరుణంలో వైసీపీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్‌కు ఫోన్ చేయగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని..తాడేపల్లి రాలేనని కుండబద్దలు కొట్టేశారు. దీంతో వైసీపీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది.

వసంతకు పిలుపు

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం కసరత్తు మెుదలు పెట్టింది. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలతోపాటు గెలుపు గుర్రాలు, పది సర్వేల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ అధ్యయనం చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టబోతున్నారు. అభ్యర్థుల మార్పు చేసేవారిని తన వద్దకు పిలిపించి సీఎం జగన్ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్లు ఎందుకు నిరాకరిస్తుంది...ఎందుకు మార్చాల్సి వస్తుందో సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్‌లకు వివరిస్తున్నారు. అంతేకాదు టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో అనేదానిపై వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ 36 మందికి పైగా ఎమ్మెల్యేలతో సమావేశమై టికెట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. నేడో రేపో మరో రెండు జాబితాలు రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు మెుదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు పిలుపు వచ్చింది. తాడేపల్లికి రావాలని ఆదేశించింది.

తాడేపల్లి రాలేను

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టికెట్లు లేని వారికి నేరుగా సీఎం జగన్ పిలిపించుకుని చెప్పేస్తున్నారు. సర్వే రిపోర్ట్‌లలో నెగిటివ్ వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని చెప్పేస్తున్నారు.ఎప్పుడు సీఎంవో నుంచి పిలుపు వస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి ఫోన్ వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు తాడేపల్లి రాలేనని తెగేసి చెప్పేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేని నేపథ్యంలో అంత అకస్మాత్తుగా కూడా రాలేదని చెప్పుకొచ్చారు. ఈ అంశం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మెహమాటం లేకుండా విమర్శలు

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు. వసంత నాగేశ్వరరావు గతంలో ఏపీ కేబినెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్‌లో కమ్మవారికి ప్రాతినిథ్యం లేదని విమర్శలు చేశారు. ఈ విమర్శలకు తనకు ఎలాంటి సంబంధం లేదని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. తనతండ్రి తనను సంప్రదించి చేసిన వ్యాఖ్యలు కాదని అధిష్టానానికి వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం అమరావతి రాజధానిపై కూడా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తన మనసులో మాట చెప్పేశారు. అమరావతికే నా ఓటు అని స్పష్టం చేసేశారు. దీంతో అప్పటి నుంచి అధిష్టానం వసంతపై శీతకన్ను వేసినట్లు తెలుస్తోంది.


జోగి రమేశ్‌తో వైరం

మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ అనుచరుల పెత్తనం...జోగి రమేశ్ ప్రత్యేకంగా వర్గాన్ని తయారు చేయడంపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని మంత్రి జోగి రమేశ్ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే వసంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గపోరు అంశాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినా సరైన రీతిలో స్పందించకపోవడంతో మండిపడుతున్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ల మధ్య వర్గపోరును చక్కదిద్దాల్సిన వైసీపీ అధిష్టానం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంపై ఆగ్రహంగా ఉన్నారు. కష్టకాలంలో కూడా తమకు అండగా లేకపోవడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News