ఈ సెగ్మెంట్‌లో వింత ఆచారం.. టీడీపీ నేత గెలవాలని వైసీపీ నేతల మొక్కులు! చివరికి ఏమైంది?
ఆంధ్రప్రదేశ్‌లోని ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓ వింత ఆచారం ఉంది. తమ సొంత పార్టీ నేత ఓడిపోవాలని టీడీపీ శ్రేణులు.. ఆ టీడీపీ నేత ఎన్నికల్లో గెలవాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓ వింత ఆచారం ఉంది. తమ సొంత పార్టీ నేత ఓడిపోవాలని టీడీపీ శ్రేణులు.. ఆ టీడీపీ నేత ఎన్నికల్లో గెలవాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటాయి. అవును మీరు విన్నది నిజమే.. ఎవరైనా తమ నేత గెలువాలని కోరుకుంటారు.. కానీ ఇక్కడ అంత సీన్ రివర్స్ ఉంటుంది. ఈ సెంటిమెంట్ కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీ శ్రేణులు కనిపించిన ప్రతీ దేవుడికి మొక్కుతారు, పొర్లుదండాలు పెడతారు. సొంత పార్టీ అభ్యర్థి ఓటమి కోసం వారు కంకణం కట్టుకుని మరీ ప్రచారం కూడా చేస్తారు. ఇంతకూ ఆ నేత ఎవరో కాదు.. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్.
1999 నుంచి సెంటిమెంట్..
పయ్యావుల గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ 1999 ఎన్నికల నుంచి కొనసాగుతోంది. దీంతో ఈసారి కూడా ఉరవకొండలో పయ్యావుల గెలవాలని వైసీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం.. ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. ఉరవకొండ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా 1994 నుంచి పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు. 1994 నుంచి 2019 వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి.. నాలుగు సార్లు గెలుపొందారు. కానీ 1994 మినహా ఆయన గెలిచిన మూడు పర్యాయాల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత శివ రామరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలవగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ పవర్‌లోకి రాగా.. ఆ ఎన్నికల్లో పయ్యావుల మాత్రం ఓడిపోయారు. ఇక 2019లో టీడీపీకి ఊహించని పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పయ్యావుల మాత్రం విజయం సాధించారు.
సెంటిమెంట్‌కు బ్రేక్..
ఇటీవల జరిగిన ఏపీ 2024 ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సెంటిమెంట్ బ్రేక్ అయిందని, శాప విమోచనం అయ్యిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు 1,02,046 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డి 21 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో ఆ సెగ్మెంట్‌లో విశ్వేశ్వర రెడ్డి గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాగా, పయ్యావుల కేశవ్ రాయలసీమ నుంచి సీనియర్ నాయకుడు కావడంతో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.