వైసీపీ నేతలు టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా పీకలేరు: అచ్చెన్నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతలను ప్రజలు చీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Update: 2023-11-01 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతలను ప్రజలు చీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారని మండిపడ్డారు. మంగళవారం బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారని..అందుకే రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టింది అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అదే కోర్టు నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారు, రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి ఇక ఎన్నిరోజులు పట్టేదోనని అన్నారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా చంద్రబాబు నాయుడు కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి? అని నిలదీస్తూ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ నేతలను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారు

చంద్రబాబు నాయుడుని, లోకేశ్‌ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకంత భయంతో వణికిపోతున్నారు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. నారా లోకేశ్ ఢిల్లీ వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్‌పై బయటకొస్తే వైసీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో నిర్బంధించారు. బెయిల్ రాకుండా అనేక కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం సేకరించపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబు నాయుడుపై మరో అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా పీకలేరని హెచ్చరించారు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News