Tirupati: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదల.. 41A నోటీసుల జారీ
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు..
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లేందుకు మోహిత్ రెడ్డి యత్నించారు. అయితే బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని సూచించారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు.
ఈ పరిణామాలపై మోహిత్ రెడ్డి మాట్లాడుతూ తనపై ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. 51 రోజుల క్రితం దాడి జరిగితే తనను ఇప్పుడు ప్రశ్నించడమేంటని నిలదీశారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు.తనకూ, కేసుకు సంబంధం లేదన్నారు. ఏ ఆలయంలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమని చెప్పారు. కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, బాధ్యులను కోర్టు ఎదుట నిలబెడతామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు.
తన కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుబట్టారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుల నిరసన వ్యక్తం చేశారు. మోహిత్ రెడ్డిని విడుదల చేయడంతో నిరసనను విరమించారు. తన కుమారుడిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అక్రమంగా కేసులు పెట్టిన వారిని విడిచిపెట్టమని భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.