తప్పు మీద తప్పు.. దారితప్పిన సంస్కరణలు

‘స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సగటు ప్రజలు కనీస అవరాల కోసం అంగలారుస్తున్న దుస్థితిలో ఉన్నాం.

Update: 2023-05-11 03:14 GMT

ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే రెండోసారి జాగ్రత్తపడతారు. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటారు. కానీ, సీఎం జగన్ రూటే సెపరేటు. వివిధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు తీవ్రమైన ఆర్థిక, సామాజిక నష్టాలు కలుగజేస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. లోపం ఎక్కడుందో సమీక్షించుకునే యత్నం చేయడం లేదు. తప్పటడుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. సంస్కరణల ప్రతికూల ఫలితాలపై ఆయన సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కనీసం ఎన్నికల ఏడాదిలోనైనా లోపాలను సరిదిద్దుకుంటారో లేదో వేచిచూడాలి.

దిశ, ఏపీ బ్యూరో: ‘స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సగటు ప్రజలు కనీస అవరాల కోసం అంగలారుస్తున్న దుస్థితిలో ఉన్నాం. మనం అధికారానికి వస్తే ఈ వ్యవస్థ ఇలా ఉండకూడదు. దీన్ని సమూలంగా మార్చేయాలి. నాయకుడు లేని వ్యవస్థను తీసుకురావాలి. ప్రతి పనిలోనూ పారదర్శకత, నిజాయతీ, చిత్తశుద్ది కనిపించాలి. ఆ దిశగా పాలనా సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరముంది’.. ఇదే విషయాన్ని గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత వైఎస్​ జగన్​ ప్రజా సంకల్పయాత్రలో అనేక సార్లు చెప్పారు. పీఠమెక్కిన తర్వాత ఆవైపుగా అడుగులు వేశారు. సంస్కరణలపై ముందుగా పార్టీ యంత్రాంగానికి అవగాహన, అమలులో జోక్యం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించనట్లుంది. అందుకే ఇప్పుడు ప్రజలతో పాటు సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి ఎలా చెక్​ పెడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైఎస్​ జగన్​ పాలనలో చేపట్టాల్సిన మార్పుల గురించి ఓ అవగాహన కలిగి ఉన్నారు. వాటిని ఒంటెత్తు పోకడతో అమలు చేయడం ఇప్పుడు లేనిపోని తలనొప్పులకు కారణమైంది. జగన్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్ని శాఖల పరిధిలో ఆపాటికే జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపేశారు. యాభై శాతానికి పైగా కొనసాగుతున్న వాటిని మినహాయించి మిగతా అన్ని పనులనూ రద్దు చేశారు. వాటికి కేటాయించిన నిధులను ఖజానాలోకి తీసుకున్నారు. అక్కడే మొదటి అడుగు వేశారు. కాంట్రాక్టర్ల వ్యవస్థలో ఆందోళన రేకెత్తించారు. నాటి నుంచి నేటి దాకా అప్పటిదాకా చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదు. కాంట్రాక్టర్ల సిండికేట్​లో కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. మరికొందరు ఇంకా అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కాంట్రాక్టర్లు ఛిన్నాభిన్నం..

స్థానిక ఎమ్మెల్యేలకు ఎన్నికల నిధిని సమకూర్చే కాంట్రాక్టర్ల వ్యవస్థ అప్పటినుంచి ఛిన్నాభిన్నమైంది. ఆయా శాఖల ఉద్యోగులకు వచ్చే పర్సంటేజీలకు గండి పడింది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది గోళ్లు గిల్లుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిణామాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే జీర్ణించుకోలేకపోతున్నారు. తర్వాత సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి చాలా ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయేట్లు చేశారు. ఒక్క రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీలు తప్ప మిగతా శాఖల్లో స్తబ్దత ఏర్పడింది. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పాలనలో చేపట్టిన ఈ మార్పుతో గ్రామాల్లో పెత్తనం చేసే నాయకులకు పనిలేకుండా పోయింది. చిన్నాచితకా అవసరాల కోసం నాయకుల దగ్గరకు ప్రజలు పరిగెత్తే అవసరం లేకుండా పోయింది. ఎన్నికల్లో ఓట్లు వేయించే పెత్తందారీ వర్గానికి ఇది మింగుడు పడడం లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి ఇదో కారణమైంది.

కౌలు రైతులు ఆక్రందన..

సంక్షేమ పథకాల అమలులోనూ పార్టీ యంత్రాంగానికి ఎక్కడా జోక్యం లేకుండా చేశారు. వలంటీర్లు, సచివాలయాలు, కలెక్టర్లు, జేసీలతోనే పాలన సాగింది. మౌలిక సదుపాయాల వృద్ధి, నీటి పారుదల, వ్యవసాయం, పారిశ్రామిక, ఇతర అనుబంధ రంగాలపై ప్రభుత్వం అంతగా దృష్టిసారించలేదు. ఆయా రంగాలకు నిధులు వెచ్చించడంలోనూ శ్రద్ధ పెట్టలేదు. పంటల సాగులోనూ రైతుల (భూజమానుల) వ్యక్తిగత లబ్దికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. 75 శాతంగా ఉన్న కౌలు రైతుల ఇబ్బందులు తొలగించి వాళ్ల జీవితాలను మెరుగు దిద్దే దిశగా చట్టాల్లో మార్పులు తీసుకురాలేకపోయారు. పంటల కొనుగోలు, ధరల స్థిరీకరణ, తదితర అంశాల్లోనూ అనేక తప్పటడుగులు వేశారు. దీంతో చిన్న సన్నకారు, కౌలు రైతులు ఆక్రోశిస్తున్నారు. ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాక నిరుద్యోగిత పెరిగింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను సైతం భర్తీ చేయలేని దుస్థితిలోకి ప్రభుత్వం జారిపోయింది.


Similar News