పోలీస్ స్టేషన్‌కు తాళం వేసి మహిళ నిరసన

నాకు అన్యాయం జరిగింది.దయచేసి న్యాయం చేయండి అంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌చుట్టూ తిరుగుతుంది.

Update: 2023-10-18 07:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నాకు అన్యాయం జరిగింది. దయచేసి న్యాయం చేయండి అంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌చుట్టూ తిరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులకు పైగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే పోలీసుల్లో ఏమాత్రం చలనం లేదు. దీంతో విరక్తి చెందిన బాధిత మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలిపింది’. ఈ షాకింగ్ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో మంగళవారం రాత్రి జరిగింది. బాధితురాలు ఎస్.గౌతమి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలియజేసినట్లు బాధితురాలు ఎస్.గౌతమి వెల్లడించారు.

అసహనంతోనే..

బాధితురాలు ఎస్ గౌతమి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  కృష్ణరాయపురంలో ఓ అపార్టుమెంట్‌లోని ప్లాట్‌ను రూ.15 లక్షలకు తాను కొనుగోలు చేసినట్లు గౌతమి తెలిపారు. ఇందులో భాగంగా ఐదు లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చానని.. అలాగే కొన్ని వస్తువులను కూడా ప్లాట్‌లో పెట్టినట్లు గౌతమి పేర్కొన్నారు. తీరా బిల్డర్‌ వచ్చి తనకు ఏ డబ్బులూ ఇవ్వలేదని, తాను ఏ పేపర్‌ మీదా సంతకం పెట్టలేదని అడ్డం తిరిగాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు ప్లాట్‌లో తాము పెట్టిన సామాన్లను సైతం బయటపడేశారని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో...పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తాళం వేసినట్లు బాధితురాలు గౌతమి వెల్లడించారు. అయితే పోలీసులు తక్షణమే స్పందించి మహిళ దగ్గర తాళం చెవి తీసుకుని పోలీస్ స్టేషన్ తాళం తీశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని లేకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని బాధితురాలు ఎస్.గౌతమి పోలీసులను హెచ్చరించింది.

Tags:    

Similar News