వై నాట్ పులివెందుల, చెత్త ఎక్కడైనా చెత్తే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ వై నాట్ కుప్పం అంటున్నారని, వైనాట్ పులి వెందుల ఎందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
దిశ, డైనమిక్: సీఎం జగన్ వై నాట్ కుప్పం అంటున్నారని, వైనాట్ పులి వెందుల ఎందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇవ్వాళ పీలేరులో జరుగుతోన్న రా.. కదలిరా సభకు హాజరైన చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. పీలేరు సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ సామాజిక న్యాయం అంటున్నారని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. జగన్ చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే అని విమర్శించారు. 175 స్థానాలకు 175 అని, వై నాట్ కుప్పం అని అంటున్నాడని, ఇప్పుడు నేను అంటున్నా.. వైనాట్ పులివెందుల అంటున్నానని, ఎందుకు కాకుడదని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికే 65 సీట్లు మర్చారని, అందులో 29 మందికి సీట్లు ఎగ్గోట్టారని, మిగతా వారిని అక్కడికి ఇక్కడికి మర్చారని.. ఈ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారం అవుతుందా.. చెత్త చెత్తే కదా అని ఎద్దేవా చేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రతినిధులని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. రాయలసీమ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నానని.. ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాల మీద అభిమానంతో ఓట్లు వేస్తే మన కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. రాయలసీమలో అన్ని కులాల వారు ఉన్నారని, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా చెప్పాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశించిన అభివృద్ది, సంక్షేమం టీడీపీ వల్లనే సాధ్యం అవుతుందని సూచించారు. ఇక పీలేరు ఏర్పాట్లు చేసిన దాని కంటే పెద్ద ఎత్తున జనం రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబును చూసిన జనం ఒక్కసారిగా స్టేజీ వద్దకు దూసుకొచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించి, చూస్తు ఉండిపోయారు. దీంతో అక్కడే ఉన్న ఎన్ఎస్ జీ కమాండోలు అలర్ట్ అయ్యి.. చంద్రబాబుకు రక్షణ కల్పించారు.