కోనసీమలో కింగ్ ఎవరు?: ఆ మూడు నియోజకవర్గాల టికెట్‌పై పోరు
యువగళం పాదయాత్రతో పొలిటికల్ సమీకరణాల్లో మార్పు రాబోతున్నాయా?
దిశ , డైనమిక్ బ్యూరో : యువగళం పాదయాత్రతో పొలిటికల్ సమీకరణాల్లో మార్పు రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా? అటు జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఆశావాహులు లోకేశ్ మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ యువగళం పాదయాత్రలో తమ అంగబలం, అర్థబలం నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో అమలాపురం మినహా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్‌చార్జిలు లేరు. మరోవైపు పి.గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ తరఫున పూర్తిస్థాయిలో ఇన్‌చార్జి నియామకం కూడా జరగలేదు. దీంతో ఈ యువగళం పాదయాత్రతోనైనా ఇన్‌చార్జిల నియామకం జరిగిపోతుందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జనసేన పార్టీ తరఫున ఆశావాహులు సైతం ఈ యువగళం పాదయాత్రతోనైనా ఇన్‌చార్జిలు, అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఓ ప్రచారం జరుగుతుంది.
నీకా నాకా సై
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు అంటేనే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలు అని ఇప్పటికీ పేరుంది. ఈ జిల్లాల ప్రజల ఇచ్చిన తీర్పుపైనే రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ ఉభయగోదావరి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫుల్ కాన్‌సెంట్రేషన్ పెడతాయి. ఇకపోతే ఈ ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాలు ఏ పార్టీ గెలుపొందుతుందే ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్. అందుకే ఎన్నికల సమయానికి అన్ని పార్టీలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతుంటాయి. ఇకపోతే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై రాజకీయంగా హాట్ టాపిక్‌నడుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలకు పెద్ద సవాల్‌గానే మారింది. అంతేకాదు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మీనమేషాలు లెక్కిస్తోంది. అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గత ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ వైసీపీకి సానుభూతిపరుడిగా మారిపోయారు. ఇకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టికెట్‌పై టీడీపీ, జనసేనల మధ్య ఫైట్ నడుస్తోంది. నీకా నాకా సై అన్నట్లుగా అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
విశ్వరూప్‌పై పోటీ చేసేది ఎవరు?...
ఇకపోతే జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయింది. అందులో ఒకటి డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ జిల్లాలో అత్యధికంగా మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గం. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు కత్తిమీద సాములా మారింది. ఇకపోతే అమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జిగా అయితాబత్తుల ఆనందరావు ఉన్నారు. ఇకపోతే జనసేన పార్టీ నుంచి శెట్టిబత్తుల రాజబాబు పనిచేస్తున్నారు. ఇకపోతే వైసీపీ నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. వైసీపీ తరఫున పినిపే విశ్వరూప్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇకపోతే టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే లోకేశ్ యువగళం సందర్భంగా తమ బల ప్రదర్శనలకు అటు ఆనందరావు ఇటు శెట్టిబత్తుల రాజబాబులు రెడీ అవుతున్నారు. అయితే శెట్టిబత్తుల రాజబాబు నాన్ లోకల్ కావడంతో లోకల్ వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి అయితాబత్తుల ఆనందరావుకు ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
గన్నవరం జనసేన వరమా?
ఇకపోతే పి.గన్నవరం నియోజకవర్గం అత్యధిక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి టీడీపీ, జనసేన పార్టీలు ఇన్‌చార్జిలలను నియమించలేదు. దీంతో అటు టీడీపీ నుంచి ఇటు జనసేన పార్టీల నుంచి ఆశావాహులు తెరపైకి భారీగానే వస్తున్నారు. ఇకపోతే టీడీపీ నుంచి జాలెం సుబ్బారావు, మోకా ఆనంద్ సాగర్, మందపాటి కిరణ్ కుమార్, బొండాడ నాగమణిలు టికెట్ రేసులో ఉన్నారు. అయితే వీరిలో మోకా ఆనంద్ సాగర్, మందపాటి కిరణ్ కుమార్‌లు నాన్ లోకల్ అని తెలుస్తోంది. దీంతో పి.గన్నవరం నియోజకవర్గం ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అయిన జాలెం సుబ్బారావు టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే స్థానిక నాయకురాలు, పి.గన్నవరం సర్పంచ్ అయిన బొండాడ నాగమణి సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ రేసు టీడీపీలో వీరిద్ధరి మధ్యే ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పెనుమాల జాన్ బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల అనంతరం జాన్‌బాబు నియోజకవర్గంలో పాగా వేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు పలు సేవాకార్యక్రమాలతో ప్రజల చెంతకు చేరుతున్నారు. జనసేన పార్టీ తరఫున అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసుకున్న నియోజకవర్గం కావడంతోపాటు గెలుపు ఓటములను కాపు సామాజిక వర్గం నిర్దేశిస్తారు కాబట్టి ఈసారి పి.గన్నవరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తరఫున బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగా పెనుమాల జాన్‌బాబు బరిలో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన సతీమణి పెనుమాల దేవి సైతం ప్రజల్లో కలియతిరుగుతూ జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈసారైనా బొంతును వరించేనా?
ఇకపోతే రాజోలు నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వుడ్. ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా గొల్లపల్లి సూర్యారావు పనిచేస్తున్నారు. ఇకపోతే జనసేన పార్టీ ఇన్‌చార్జిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో జనసేన ప్రాబల్యం అత్యధికంగా ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ జనసేన అభ్యర్థిమాత్రం ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన రాపాక వరప్రసాదరావు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అనుబంధంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో రాపాకదే సీటు అని ఒకవైపు ప్రచారం జరుగుతున్న కొంతమంది డౌటే అంటున్నారు. ఇక టీడీపీ, జనసేనల విషయానికి వస్తే గొల్లపల్లి సూర్యారావు, జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వరరావుల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. జనసేనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన ప్రజలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ జనసేనకు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.