జగన్, పవన్‌ల పర్యాటనలతో ఫలితమేంటి..? ప్రశ్నిస్తున్న జనం..!

వెనకటికి ఏదో సామెత చెప్పినట్లుంది. అయిననూ హస్తినకు పోయి రావలె అన్నట్లు జనసేనాని ఢిల్లీ ఎందుకు వెళ్లారు..

Update: 2023-04-05 06:58 GMT

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్ర పెద్దలతో ఆయనేం మాట్లాడారో, రాష్ట్రానికి ఏం సాధించారో ఎవరికీ తెలియదు. హస్తిన పర్యటన వివరాలను ఆయన ఏనాడూ మీడియాకు వెల్లడించలేదు. సీఎంఓ విడుదల చేసే రొటీన్ ప్రెస్ నోట్లే మీడియాకు దిక్కు. ఇపుడు తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు మూలకారణమైన బీజేపీ పెద్దలతో ఆయనేం మాట్లాడతారో, వారెలాంటి హామీలిస్తారో ఎవరికీ తెలియదు. జగన్ పర్యటనల మాదిరిగానే పవన్ కల్యాణ్ టూర్లు కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర రాజకీయ క్రీడలో జగన్ మొదటి కృష్ణుడైతే పవన్ రెండో కృష్ణుడని వ్యాఖ్యానిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: వెనకటికి ఏదో సామెత చెప్పినట్లుంది. అయిననూ హస్తినకు పోయి రావలె అన్నట్లు జనసేనాని ఢిల్లీ ఎందుకు వెళ్లారు.. కేంద్రాన్ని ఏమి అడుగుతారనేది రాష్ట్రంలోని పవన్​అభిమానులు, జన సైనికులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మిగతా రాజకీయ వర్గాల్లోనూ ఇదే ఆసక్తి నెలకొంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో పవన్, మనోహర్​మాట్లాడారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అసలు పోలవరానికి కొర్రీలు వేస్తోంది కేంద్ర సర్కారే కదా! విశాఖ ఉక్కును అమ్మొద్దని అడగలేరా! విభజన హామీలు నెరవేర్చాలని ఎందుకు ప్రశ్నించడం లేదు? నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులేందని ఎందుకు నిలదీయడం లేదనేది సగటు ప్రజల నుంచి వినిపిస్తోంది. పవన్​ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లారంటే కచ్చితంగా ఏదో సాధిస్తారనే విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సీఎం జగన్​ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులతో వర్క్​షాపు నిర్వహిస్తున్న మనసంతా ఢిల్లీపైనే ఉంది. అక్కడ పవన్​కల్యాణ్​కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడతారనే దానిపైనే దృష్టి సారించినట్లు సమాచారం. తీరా చూస్తే హస్తినలో మోడీ, అమిత్‌షాలు ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదని తెలిసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో మాట్లాడారు. రాష్ట్ర నేతల తీరు వల్లే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల క్యాడర్​కలవడం లేదని చెప్పారట. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​షెకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ప్రాజెక్టును వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పారు. కేంద్ర జోక్యం చేసుకొని సత్వరం పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు.

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. ఇది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం పరిధిలోని జాతీయ ప్రాజెక్టులు దేశంలో కొన్ని దశాబ్దాల తరబడి కునారిల్లుతున్నాయి. పోలవరాన్ని కూడా వాటి మాదిరిగానే మూలకు నెడతారని భావించి గత ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. ప్రస్తుత వైసీపీ సర్కారు ఎంత వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నించినా కేంద్రమే మోకాలడ్డుతోంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి రావడంతో అంచనాలు పెరిగాయి. పునరావాస కల్పన వ్యయం కూడా పెరిగింది. దీనికి కేంద్ర సర్కారు ససేమిరా అంటోంది.

పాత అంచనాల ప్రకారమే చెల్లిస్తామని మోకాలడ్డుతోంది. అడహాక్‌గా పది వేల కోట్లు ఇస్తే కనీసం 41.5 అడుగుల మేర నీటి నిల్వతో ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేస్తామని సీఎం జగన్​ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అడుగుతున్నారు. అయినా కనికరించడం లేదు. అసలు 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడం కుదరదని పార్లమెంటులోనే కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. జనసేనాని దీన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనమేంటని గోదావరి ప్రాంత వాసులు తల పట్టుకుంటున్నారు.

జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటే విశాఖ ఉక్కు అమ్మకం గురించి ఏం చెబుతారనేది జన సైనికుల్లో నలుగుతున్న ప్రశ్న. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఇచ్చే నిధులను కేంద్రం నిలిపేసింది. బుందేల్​ఖండ్​ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఇక్కడ ప్రజలు అడుగుతుంటే ఈపాటికే ఇస్తున్న అరకొర నిధులకూ కత్తెర వేసింది. దీని గురించి ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక జనసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇంకా విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిది అయితే రాష్ట్ర సర్కారుపై నెట్టేసి చేతులు దులుపుకుంది. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేస్తూ జనం మూలిగలు పీలుస్తోంది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్​ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు అనుమతి కోరినప్పుడల్లా ఏదో ఒక షరతు పెట్టి ప్రజలపై భారాలు మోపుతోంది. వీటి గురించి లేశమాత్రమైనా కేంద్రాన్ని ప్రశ్నించకుంటే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు వస్తాయా? అనే ఆందోళన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది.

ఈ అంశాలన్నింటిపై కేంద్ర సర్కారు జనసేనకు ఓ స్పష్టతనిచ్చి కనీసం కొన్నింటినైనా నెరవేరిస్తే ఎన్నికల్లో చెప్పుకొని ఓట్లు అడగడానికి వీలవుతుంది. అవేం చేయకుండా పవన్​కల్యాణ్​ఎన్ని చెప్పినా ఉత్తరాంధ్రలో మునుపటి ఫలితాలే వస్తాయని పార్టీ క్యాడర్లో గుబులు రేకెత్తిస్తోంది. ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ పెద్దలు సీఎం జగన్‌కు అన్ని విధాలా సహకరిస్తున్నారనే భావన సర్వత్రా నెలకొంది. జనసేనతో పొత్తు పెట్టుకొని వైసీపీతో తెరచాటు సంబంధాలు కొనసాగించడం వల్ల బీజేపీకి రాష్ట్రంలో పోయేదేమీ లేదు. జనసేన మాత్రం తీవ్రంగా నష్టపోతుంది. దీనిపై పవన్​కల్యాణ్ ఆలోచించి బీజేపీతో కలిసి ముందుకు సాగాలంటే కనీసం కొన్ని హామీలనైనా సాధించకుంటే ప్రజలను మెప్పించలేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పవన్​ఢిల్లీ పర్యటన ఇటు క్యాడర్లో, అటు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News