దీపావళి ఆఫర్ బాబు.. దోచుకున్నోడికి దోచుకున్నంత..

ఈ నెల 31వ తేదీన పండుగ నేపథ్యంలో ఇప్పటి నుంచి పాత బాణసంచా సరుకుతో పాటు, కొత్తది కూడా కొంత రప్పించుకుని అధిక లాభాలు ఆర్జించే పనిలో వ్యాపారులు నిమగ్నమవుతున్నారు.

Update: 2024-10-24 02:24 GMT

దిశ, పాలకొల్లు: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో బాణసంచా వ్యాపారం ఊపందుకుంటోంది. ఈ నెల 31వ తేదీన పండుగ నేపథ్యంలో ఇప్పటి నుంచి పాత బాణసంచా సరుకుతో పాటు, కొత్తది కూడా కొంత రప్పించుకుని అధిక లాభాలు ఆర్జించే పనిలో వ్యాపారులు నిమగ్నమవుతున్నారు. కొందరైతే నాణ్యతలేని, నిషేధిత చైనా టపాకాయలను కూడా తెచ్చుకుని ఎక్కువ లాభార్జన మార్గాలు వెతుక్కుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలు, ఏలూరు జిల్లా పట్టణ మండలాల్లో కొందరు అక్రమ బాణసంచా వ్యాపారాలకు తెర తీసినట్లు ప్రచారం. ఇదే పరిస్థితి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గోడౌన్ల వద్ద రక్షణ తూతూమంత్రమే..

మందుగుండు సామాగ్రిని నిల్వ చేసే గోదాముల వద్ద రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. గోదాముల వద్ద ఇసుక, నీటి వనరులు, కార్బన్ డయాక్సైడ్స్ సిలిండర్, తగినన్ని సిద్ధంగా ఉంచడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని వినియోగించే శిక్షణ పొందిన సిబ్బంది కూడా లేరని సమాచారం. లైసెన్స్ పొందిన డీలర్లు ఆయా గోదాములలోను, దుకాణాల్లోనూ అంత మేరకే బాణసంచా సరుకు నిల్వలు ఉంచుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ పరిమాణంలో నిల్వలు పెట్టుకుని, వాటిని విక్రయించుకుని అధిక లాభాలు పొందుతున్నట్లు తెలిసింది. టపాకాయల ప్యాకెట్‌లపై కూడా అసలు ధరలు కంటే 10 రెట్లు అధికంగా ధరలు ముద్రించి దోపిడీకి తెర లేపుతున్నారు. ఈ దోపిడీ నీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది.

మామూళ్ల మత్తులో అధికారులు..

లైసెన్సుల పరిమితికి మించి బాణసంచా సరుకులు దొడ్డి దారిలో విక్రయించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంకు రావల్సిన కోట్లాది రూపాయల పన్నులకు గండి కొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జీఎస్టీ అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు సమాచారం. వీరు కనుక బాణసంచా గోదాములు, దుకాణాలు తనిఖీ చేసి పన్నులు కట్టిస్తే ఇలా ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండేదని పలువురు అంటున్నారు. వీరంతా మామూళ్ల మత్తులో ఉండడం వల్లే ఇలాంటి అక్రమాలు సాగిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News