Tiger: పోలవరంలో పులి సంచారం వాస్తవమే
పోలవరం ప్రాజెక్టులో చిరుత పులి సంచరించింది
దిశ, ఏలూరు ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టులో చిరుత పులి సంచరించింది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టి తరలిస్తున్న లారీ డ్రైవర్ కంటపడటంతో చిరుత పులి రోడ్డు దాటే చిత్రాన్ని డ్రైవర్ తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియోను చూసిన పోలవరం ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.
చిరుత సంచారంపై ఎఫ్.ఆర్వో డేవిడ్ తో ' దిశ'
పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలకు దిశ ప్రతినిధి పోలవరం ఎఫ్.ఆర్వో డేవిడ్‌ని వివరణ కోరగా చిరుత పులి సంచారం వాస్తవమేనని తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న 902 కొండ ప్రాంతం వెనుక పక్కకు పులి వచ్చినట్లు వివరించారు. అడవిలో మంచినీరు లేకపోవడంతో దాహార్తిని తీసుకోవడం కోసమే చిరుత ప్రాజెక్టులో ఉన్న కొండ వెనక భాగంలో మంచినీరు ఉండడంతో నీరు తాగేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల సమీపంలో వచ్చినట్లు డేవిడ్ తెలిపారు. మంచినీరు తాగిన దగ్గర నుంచి సుమారు 200 మీటర్లు చిరుత నడిచినట్లు తెలిపారు. చిరుత సంచారంపై పాదముద్రలు సేకరించి కదలికలను కనిపెడుతున్నామని చెప్పారు. ప్రాజెక్టులో కార్మికులు అర్ధరాత్రి వేళ బహిర్ భూములకు వెళ్లడం గాని ప్రాజెక్టు లోపల సంచరించడం కానీ చేయొద్దని ఎఫ్ఆర్ఓ డేవిడ్ తెలిపారు.
జాతీయ పార్కులో చిరుతలు ఉన్నాయి
పోలవరం పరిసర ప్రాంతాల గ్రామాలు ముంపుకు గురి కావడంతో ఆ ప్రదేశమంతా నిర్మానుషంగా అయిందన్నారు. అయితే ఆ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా నిర్దేశించడం జరిగిందని చెప్పారు. దీంతో పాపికొండల అభయారణ్యంలో అడవి జంతువులు సంచారం పెరిగిందని పేర్కొన్నారు. పాపికొండలు ప్రాంతంలో చిరుతలు, పులులు, లేడులు దుప్పులు నెమళ్ళతోపాటుగా మిగిలిన జంతువులు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించారు. వేసవి కావడంతో గుట్టలపై నీళ్లు లేకపోవడంతో దాహార్తిని తీర్చుకోవడం కోసం కిందకు వస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్.ఆర్వో డేవిడ్ హెచ్చరించారు.