తూకం, ధరల్లో మోసం..నిండా ముంచుతున్న పొరుగు వ్యాపారులు

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పత్తి రైతుల కష్టం, దళారుల పాలవుతోంది..

Update: 2024-12-06 03:18 GMT

దిశ, కుక్కునూరు: పత్తి రైతుల కష్టం, దళారుల పాలవుతోంది. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులు గ్రామాల్లో గద్దల్లా వాలిపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తూకం, ధరల్లో మోసం చేస్తూ నిండా ముంచుతున్నారు. ఫెర్టిలైజర్స్ వ్యాపారులు, పొరుగు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడి, పత్తిని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఇక్కడి గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పండించే పత్తిలో నాణ్యత ఉంటుంది. ఎకరాకు సుమారు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వరదలు, వానలతో పత్తి రైతు కుదేలయ్యారు. అప్పో సొప్పో చేసి పెట్టుబడులు రెట్టింపుతో రైతులు పత్తి వేశారు. తీరా పత్తి పంట చేతికి వచ్చే సమయానికి అరకొరగా, ముందుగా పెట్టుబడులు పెట్టిన ఎరువుల వ్యాపారులు, దళారులు మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతన్నను నిలువునా ముంచుతున్నారు

తూకంలో మోసం..

నిబంధనలకు విరుద్ధంగా పాత చెక్క కాటాలతో పత్తిని తూకం వేసి దళారులు మోసం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7వేలు వరకు పలుకుతుంటే, విలీన మండలాల్లో దళారులు మాత్రం కుంటి సాకులు చెప్పి క్వింటా పత్తి రూ.6వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి తూకం రాళ్లు సరిపడకపోతే మామూలు బండరాళ్లు వేసి బరువును తూకం వేసి.. రాళ్లతో పాటు కాటా పెడుతున్నారు. సుమారు 10 క్వింటాల పత్తిని రైతు అమ్మితే సుమారు అర క్వింటా పత్తి రద్దు, తేమ పేరిట తరుగు తీస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు దళారులు సీక్రెట్ రిమోట్ కాటాతో రైతులను ముంచుతున్నారు

నిబంధనలకు పాతర..

పత్తి వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లారీలను గ్రామాల్లో రోడ్లపై ఉంచి పత్తిని లోడు చేస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది వాటిల్లితోంది. పరిమితికి మించి లోడుతో పత్తి లారీలు గ్రామాల్లో వెళ్తుంటే భయాందోళనకు గురవుతున్నామని రెండు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి వ్యాపారులు కనీస ప్రమాణాలను కూడా పాటించడం లేదని పలువురు రైతులు, వివిధ సంఘాల నాయకులు వాపోతున్నారు. తక్షణమే విలీన మండలాల్లో సీసీఐ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఆ షాపుల నుంచే మోసం మొదలు..

ఫెర్టిలైజర్ షాపుల నుంచే రైతులకు మోసాలు, కష్టాలు మొదలవుతున్నాయి. రైతుల ఆర్ధిక బాధలు ఆసరా చేసుకొని ఆ దుకాణ యజమానులు అధిక వడ్డీలకు పురుగు మందులు ఇస్తూ, రైతు పండించిన పంటను తమకే ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసి, మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు తీసుకొంటున్నారు. ఇలాంటి ఫెర్టిలైజర్ షాపులు కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో గ్రామగ్రామానికి పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరు చేసినదే చెల్లుబాటు అవుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.


Similar News