Kolleru: ఏకో సెన్సిటివ్ జోన్‌పై ఆందోళనకు సిద్ధమైన CPM

కొల్లేరు ప్రజలకు నష్టం కల్గించే ఏకో సెన్సిటివ్ జోన్‌పై దశలవారీ ఆందోళన చేపడతామని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి స్పష్టం చేశారు. ..

Update: 2023-11-26 18:02 GMT

దిశ, ఏలూరు: కొల్లేరు ప్రజలకు నష్టం కల్గించే ఏకో సెన్సిటివ్ జోన్‌పై దశలవారీ ఆందోళన చేపడతామని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి స్పష్టం చేశారు. ఈ అంశంపై 30న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాట్లు ఆయన తెలిపారు. ఏలూరు పవరుపేట సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. లింగరాజు, పి.కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఎం కార్యదర్శి రవి మాట్లాడుతూ కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో 2011లో విడుదల చేసిన జీవోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 5వ కాంటూరుపై 10 కిలోమీటర్ల వరకు పర్యావరణం పేరుతో 26 నిబంధనలు పెట్టి వేలాదిమంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లేరు ఏకో సెన్సిటివ్ జోన్ పేరుతో ప్రజల పొట్ట కొట్టవద్దని, 3వ కాంటూరుకు కుదించి కొల్లేరు ప్రజల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం గ్రామసభలు విధిగా జరపాలనన్నారు. కొల్లేరు ప్రాంతంలో అన్ని పంచాయితీలు తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.

Tags:    

Similar News