ఏలూరు జిల్లాను వణికిస్తున్న చిరుత

ఎక్కడి నుంచి తప్పిపోయి వచ్చిందో గానీ ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాన్ని చిరుతపులి వణికిస్తోంది.

Update: 2024-10-25 02:48 GMT

దిశ, ఏలూరు: ఎక్కడి నుంచి తప్పిపోయి వచ్చిందో గానీ ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాన్ని చిరుతపులి వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, రాజానగరం ప్రాంతాల్లో తిరిగిన చిరుతే ఇప్పుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, భీమడోలు మండలాల్లో సంచరించి ప్రస్తుతం పెదవేగి మండలం వంగూరు, జగన్నాథపురం ప్రాంతాలకు చేరుకుంది. దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్‌ కెమెరాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అదీ, ఇదీ ఒక్కటే..

ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న చిరుత రాజానగరం ప్రాంతంలో తిరుగుతున్న చిరుత ఒక్కటేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల, భీమడోలు, దెందులూరు, పెదవేగి మండలాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుత ఏ ప్రాంతం నుంచి రాజా నగరానికి చేరుకుని అక్కడి నుండి ఏలూరు జిల్లాకు వచ్చిందనే విషయం ఇంకా స్పష్టంగా తేలలేదు. గతంలో పోలవరం మండలం పాపికొండలు అభయారణ్యంలో నుంచి పోలవరం మీదుగా గోపాలపురం మండలం దొండపాడు, నల్లజర్ల మండలం పుల్లలపాడు అటవీ ప్రాంతాలకు పెద్దపులి, చిరుతపులి తిరిగాయి. ఆ తర్వాత పెద్ద పులి మాత్రం పెదవేగి మండలం వరకు వచ్చి తిరిగి వెనక్కి పాపికొండల లోకి వెళ్లిందని అధికారులు అప్పట్లో అంటే మూడు నెలల క్రితం ఊపిరి పీల్చుకున్నారు.

కుడి కాలువ మీదుగా సంచారం..

తాజాగా ఏలూరు జిల్లాలో చింతలపూడి వైపు నుంచి ద్వారకాతిరుమల మండలం జాతీయ రహదారి ప్రాంతంలోని ఎం నాగులపల్లి గ్రామానికి చేరింది. ఆ తర్వాత భీమడోలు జంక్షన్‌ పరిసరాల్లో సంచరించిందని ట్రాప్‌ కెమెరాల్లో స్పష్టమైంది. దాన్ని పట్టుకునేందుకు పలు ట్రాప్‌లు ఏర్పాటు చేసినా దొరకలేదు. ఇప్పడు పెదవేగి మండలం జగన్నాధపురం, వంగూరు ప్రాంతాల్లో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. ఇది పోలవరం కుడి కాలువ గట్టు మీద తిరుగుతూ అన్ని గ్రామాల్లో విహరిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల చిరుతలు, పెద్ద పులులు జనావాసాల వైపు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం .జగన్నాథపురం, వంగూరు ప్రాంతాలలో అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులతో కలిసి పులి కాలి ముద్రలను పెదవేగి పోలీసులు గుర్తించారు. పులి సంచారం చేస్తున్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

Tags:    

Similar News