ఉక్రెయిన్‌లోని ఈ తెలుగబ్బాయి తన పులుల్ని వదిలి రానంటున్నాడు..!
ఉక్రెయిన్‌లోని ఓ తెలుగు డాక్టర్ తాజాగా వైరల్ గా మారాడు. Telugu Doctor refusing to leave Ukraine to feed his Pets.
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి లక్షలాదిగా జనాలు సరిహద్దు దేశాలకు పారిపోతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన చాలామంది భారతీయులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. అయితే, ఇటీవల కొందరు భారతీయ జంతుప్రియులు అక్కడ తాము పెంచుకుంటున్న కుక్కల్నీ, పిల్లుల్నీ వదిలి రాలేమంటూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఓ తెలుగు యువ డాక్టర్ తాజాగా మీడియాలో ఇంట్రస్టింగ్ పర్సన్‌గా మారాడు. ఉక్రెయిన్‌లో తాను పెంచుకుంటున్న చిరుతపులిని, జాగ్వార్‌ను వదిలి రాలేనంటున్నాడు. ఇక, వాటి పోషణకు కావాల్సిన ఆహారాన్ని సేకరించడానికి యుద్ధ భూమిలో ఒంటరిగా తిరిగేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప.గో.జిల్లా, తణుకుకు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో డోన్‌బాస్ ప్రాంతంలోని సెవెరోడోనెట్స్క్‌లో తన ఇంటి క్రింద ఉన్న బంకర్‌లో ఓ పాంథర్, ఒక చిరుతపులితో కలిసి ఉన్నాడు. ఈ ప్రాంతంలో రష్యా బలగాలు భారీగా మొహరిస్తున్నాయి. గంట గంటకూ పరిస్థితి దిగజారుతూనే ఉంది. కానీ, డాక్టర్ పాటిల్ తన పులుల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. అదేమంటే, "నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా పెంపుడు జంతువులను వదులుకోను" అంటున్నాడు. అయితే, తణుకులో ఉన్న పాటిల్ కుటుంబం తనను ఇండియాకు రమ్మని బతిమాలుతున్నారు. కానీ పాటిల్ తాను చచ్చిపోయే వరకూ వాటిని కాపాడుకుంటాననే అంటున్నాడు. పైగా, వాటి ఆహారం కోసం ఒంటిరిగా కారులో చుట్టుపక్కలున్న గ్రామాలకు వెళుతున్నాడు. సైనిక బలగాలు ఆపుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు కానీ వాటి సంరక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నాడు.
డాక్టర్ పాటిల్ మెడిసిన్ చదవడానికి 2007లో ఉక్రెయిన్ వెళ్లి, తర్వాత డాన్‌బాస్‌లో స్థిరపడ్డాడు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా చేరాడు. స్థానిక జంతుప్రదర్శనశాలలో అనాధగా ఉన్న చిరుతపులిని అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నాడు. దానికి యషా అని పేరుపెట్టి, పెంచుకుంటున్నాడు. రెండు నెలల క్రితం, యషాకు జతగా బ్లాక్ పాంథర్ సబ్రినాను కూడా తీసుకువచ్చాడు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, వీటి ఆహారం కొనడానికి మాత్రమే బంకర్ నుండి బయటకు వస్తున్నాడు. తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్పక ఇండియా వస్తానంటున్నాడు.