ప్రత్యేక హోదాకంటే ఎక్కువ చేశాం: Purandheswari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ మోసం చేసిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ మోసం చేసిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మోసం చేయలేదని.. అన్ని విధాలా అండగా నిలిచిందని వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకీ నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు మించి రాష్ట్రానికి కేంద్రం సాయం చేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. విభజన హామీలు అన్నింటిని దాదాపు నెరవేర్చిందని.. మిగిలిన వాటిని కూడా నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏలూరులో శుక్రవారం దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. అన్ని శాఖల్లోనూ అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు డిజిటల్ పేమేంట్స్‌ను ఆమోదించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఏలూరులోని కార్పొరేషన్ శ్మశానాల్లో అంత్యక్రియలకు రూ. 5 వేలు చొప్పున వసూలు చేయడంపై మండిపడ్డారు. ఇలాంటి వసూళ్లు దుర్మార్గమన్నారు. ఏపీ ప్రభుత్వం దివాళా దిశగా పయనిస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.