టీడీపీలో సీనియర్ల అలకలు.. జనసేనలో రోడ్డెక్కిన పంచాయితీ
ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన అధినాయకులు విడుదల చేసిన తొలి జాబితాలో టికెట్ అశించిన వారికి నిరాశ ఎదురుకావటంతో అసంతృప్తి బట్టబయలైంది.
దిశ, ఉభయగోదావరి జిల్లాల ప్రతినిధి: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన అధినాయకులు విడుదల చేసిన తొలి జాబితాలో టికెట్ అశించిన వారికి నిరాశ ఎదురుకావటంతో అసంతృప్తి బట్టబయలైంది. మొత్తం 34 స్థానాలకు గాను ఉమ్మడి తూర్పుగోదావరిలో 11, పశ్చిమలో 6చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 17స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో టిడిపి తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. రాజనగరంలో టిడిపి నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి చూపారు. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటి ఇరు వర్గాలకు క్లారిటీ రాలేదు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది.
ముమ్మిడివరంలో..
ముమ్మిడివరం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా బండారు సత్యానందరావును ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన, టిడిపి సీట్ల ప్రకటనతో ఇరుపార్టీల్లో నిరసనలు మొదలయ్యాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు,ఉండి, ఆచంట,తణుకు సీట్లు టిడిపి అభ్యర్థులకు కేటాయించారు.ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు,చింతలపూడి స్థానాలు టిడిపికి కేటాయించారు.
చింతలపూడిలో అసంతృప్తి..
మాజీ మంత్రి పీతల సుజాత చింతలపూడి టిక్కెట్ ఆశించినా, చింతలపూడిలో స్థానికేతరుడు, ప్రవాసాంధ్రుడు రోషన్ కుమార్‌కు టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు నిరాశ ఎదురైంది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్రరావుకు సీటు దక్కలేదు. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది. తాడేపల్లిగూడెం,నరసాపురం స్థానాల్లో టిడిపి, జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో ఎటూ తేలలేదు. ఏలూరు సీటు పై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్పలనాయుడుకు నిరాశ తప్పలేదు.