రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు: ఐసీఐడీ సదస్సులో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఇరిగేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఐసీఐసిడి ప్రెసిడెంట్ డా. రగబ్ రగబ్, వైస్ ప్రెసిడెంట్ వోహ్రా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన జలాలను ఒక చోట చేరుస్తూ విశాఖ వేదికగా గురువారం అంతర్జాతీయ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రసంగించారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ ఉంది అని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
నీటి సంరక్షణే మా ప్రాధాన్యత
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగం అని స్పష్టం చేశారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. 2019లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది అని వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది అని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నామన్నారు. ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు
వారం రోజులపాటు సదస్సు
25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగే ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ నెల 2న ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు ఈనెల 8 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హాజరయ్యారు. కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసీఐడిలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గోన్నారు. వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏవిధంగా వినియోగించుకోలన్న అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. అలాగే సంప్రదాయ నీటివనరులను అభివృద్ది చేయడం, నీటిపారుదల వ్యవస్థలను బలోపేతం చేయడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందకు అనుసరించాల్సిన మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల , మురుగునీటిని శుద్దిచేసి సాగునీటిగా వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడులకోసం శుద్ద జలాల వినియోగం వంటి పలు అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. వీటితోపాటు ముఖ్యంగా రైతు సాధికారతర అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగాదరల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయరంగంలో సాంకేతికను పెంపొందించడం ,వ్యవసాయ పరిశోధనలు ,ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు ఈ వారం రోజులపాటు జరగనున్నాయి.