Shivaratri: పెరుగుతున్న స్పటిక లింగం ... ప్రత్యేక పూజలు
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి గాంచిన శివాలయాలు తూర్పుముఖంగాను, పశ్చిమ ముఖముగాను దర్శనమిస్తూ ఉంటాయి...
దిశ, అనకాపల్లి: భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి గాంచిన శివాలయాలు తూర్పుముఖంగాను, పశ్చిమ ముఖముగాను దర్శనమిస్తూ ఉంటాయి. మునగపాక మండలం వాడరాపల్లి గ్రామంలో శివాలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వయంభుగా వెలసిన విశ్వేశ్వరుడు దక్షిణ ముఖంగా దర్శనమిస్తుంటారు. అందుకే దక్షిణ కాశీ విశ్వేశ్వరుడుగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. దక్షిణ కాశీ విశ్వేశ్వరుడికి మరో ప్రత్యేకత ఉంది. భక్తులకు స్పటిక లింగం రూపంలో దర్శనం ఇవ్వడమే కాకుండా ప్రతి ఏటా శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుంది. పూర్వం రైతులు పొలాల గట్లు నిర్మాణం కోసం ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేసేందుకు తవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో శివలింగం బయటపడడంతో అక్కడి నుంచి తరలించేందుకు శివలింగం అంచు వరకు తవ్వేందుకు ప్రయత్నాలు చేశారు.
సుమారు 25 అడుగులు వరకు కిందకు తవ్విన శివలింగం అంచు కనిపించకపోవడంతో శివుడు స్వయంభుగా వెలసేడని అక్కడే గుడి కట్టి పూజలు ప్రారంభించారు. సుమారు 250 సంవత్సరాలు నుండి భక్తులు పూజలు అందుకుంటున్న ఈ శివాలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది, ఆవ సమీపంలోని మరో శివలింగం నీటిలో దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆవలోకి తాటి దోనెలపై విహారయాత్ర చేస్తూ ఉంటారు. దేశంలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందిన వాడరాపల్లి ఆవకు విదేశీ పక్షులు వలస రావడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆవకు అవతలి వైపు కొండకర్ల ఆవ అని కూడా పిలుస్తూ ఉంటారు.
దక్షిణ కాశీ విశ్వేశ్వరునికి శివరాత్రి సందర్భంగా భక్తులు విశేష పూజలు చేశారు. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. రాత్రి జాగారం.. తెలవారే వరకు శివ దర్శనానికి భక్తులు బారులు తీరారు.