అయ్యా చంద్రబాబు.. దత్తపుత్రుడు.. కాస్త పట్టించుకోండయ్యా : జగన్ విమర్శలు
సెప్టెంబర్ నెల నుంచే డయేరియా గుర్లలో మృత్యు ఘంటికలు మోగించింది. మొత్తం 14 మంది వ్యాధితో మరణించగా.. ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. ఇటీవల గుర్లలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యుఒడికి చేరుకున్నారు. సెప్టెంబర్ నెల నుంచే డయేరియా గుర్లలో మృత్యు ఘంటికలు మోగించింది. మొత్తం 14 మంది వ్యాధితో మరణించగా.. ఇప్పటికీ కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుర్లకు చేరుకున్న జగన్ ను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. డయేరియా ప్రబలి మరణించినవారి కుటుంబ సభ్యులను జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడిన ఆయన ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ అని హామీలిచ్చి.. ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి.. హామీలను అమలు చేయాలన్నారు. ఏ ఇష్యూ వచ్చినా.. జగన్ పేరు చెప్పి డైవర్ట్ చేస్తున్నారన్నారు. కుటుంబ గొడవల్లో తలదూరుస్తున్నారంటూ.. ప్రముఖ మీడియా ఛానళ్లపై ధ్వజమెత్తారు. కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవేనని, వాటిని రాజకీయాల్లోకి లాగటం సబబు కాదన్నారు. మీ ఇళ్లల్లో గొడవలు లేవా అని అధికారపార్టీ నేతలను మీడియా ముఖంగా ప్రశ్నించారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజల సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేశారు. మరోసారి దత్తపుత్రుడు అంటూ.. పవన్ పైనా విమర్శలు చేశారు.