మహిళలు ఆర్ధికంగా ఎదిగితే సమాజం బాగుపడుతుంది
విజయనగరం మొత్తం 50 వేల మంది విద్యార్థులు,
దిశ, ఉత్తరాంధ్ర: విజయనగరం మొత్తం 50 వేల మంది విద్యార్థులు, మహిళ సంఘాల మహిళలు, సచివాలయ మహిళా ఉద్యోగులు తదితరులు మానవహారంగా ఏర్పడ్డారు. ప్రత్యేక వాహనంపై ర్యాలీగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా ఎస్పీ దీపికా ఎం. పాటిల్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వరకు 10 కిలోమీటర్ల మేర మానవహారం ర్యాలీ కొనసాగింది. దారి పొడువునా నినాదాలు ఇస్తూ.. అతిథులకు విద్యార్ధులు, మహిళా వైద్యులు స్వాగతం పలికారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్య పరచడం, తక్కువ వయసులో వివాహాలు జరగడం వల్ల కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి మానవ హారం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. మహిళల్లో ధైర్యం కల్పించి వారికి విద్య ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో చైతన్య పరచడం ఈ మహిళా దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.