హెచ్ఆర్ఏ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోండి: విశాఖ కార్మికుల డిమాండ్

విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవకాశమే లేదంటూ ప్రభుత్వం హామీ ఇస్తున్నా.. ఉద్యోగులు మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయంటూ ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు.

Update: 2024-09-23 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఒకపక్క ప్రైవేటీకరణ అవకాశమే లేదంటూ ప్రభుత్వం హామీ ఇస్తున్నా.. ఉద్యోగులు మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయంటూ ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. తాజాగా యాజమాన్యం ప్లాంట్‌లో పని చేస్తున్న 7 వేల మందికి హెచ్‌ఆర్‌ఏ నిలిపివేసిందని, ఇది చాలా దారుణమంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హెచ్‌ఆర్ఏ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే కార్మికులు మాట్లాడుతూ.. ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే దిశగానే సాగుతోందని, ఇప్పటికే దాదాపు 3000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు వీఆర్‌ఎస్‌ పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్‌ నగర్‌ స్టీల్‌ ప్లాంట్‌కు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వాపోతున్నారు. అలాగే ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 455 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News