లంచాల ఏసీపీపై సస్పెన్షన్ వేటు
విశాఖ హార్బర్ ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. తమ వద్ద లంచాలు తీసుకుని కూడా పనిచేయడం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో హార్బర్ ఏసీపీ మోజెస్ పాల్ ను డీజీపీ సస్పెండ్ చేశారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: లంచం తీసుకొని పనిచేయని పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. తమ వద్ద లంచం తీసుకున్నా పని చేయలేదంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో విశాఖలోని హార్బర్ ఏసీపీ మోజెస్ పాల్‌ను డీజీపీ సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక ఎస్సీ, ఎస్టీ కేసులో (68/2023) నిందితుడిగా ఉన్న అంకం చౌదరి (గుంటూరు) అనే వ్యక్తిని కేసు నుంచి తప్పిస్తానని హార్బర్ ఏసీపీ మోజెస్ పాల్ ఏడాదిగా నమ్మిస్తూ వచ్చారు. అయినా కేసు నుంచి తప్పించకపోవడంతో బాధితుడు నేరుగా విశాఖ సీపీని ఆశ్రయించారు. పూర్తి ఆధారాలు సమర్పించడంతో సీపీ ప్రతిపాదనల మేరకు డీజీపీ మోజెస్ పాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆది నుంచీ వివాదాలమయం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో మోజెస్ విశాఖలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా చర్యలకు ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. మల్కాపురం, వన్ టౌన్, న్యూ పోర్ట్, హార్బర్ పోలీస్ స్టేషన్లకు ఏసీపీగా ఉన్న మోజెస్ పాల్ రెండేళ్లగా వైజాగ్‌ను పట్టుకుని వేలాడుతున్నారనే ఆరోపణలున్నాయి. 1991వ బ్యాచ్ కు చెందిన ఆయన (గుంటూరు రేంజి) విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచీ అనేక విమర్శ లెదుర్కొన్నారు. వివిధ సంఘటనల నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలకు అందజేయాలంటూ గంగవరం పోర్ట్ యాజమాన్యం నుంచి కూడా మోజెస్ పాల్ భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేశారని సమాచారం. ఆయన సామాజిక వర్గానికి చెందిన సిబ్బందిని కాపాడుకుంటూ వస్తూ, రౌడీ షీటర్లతో సైతం మోజెస్ పాల్ అంటకాగారనే ఆరోపణలు వున్నాయి.
మరికొందరు అధికారులపైనా..
ఏసీపీ స్థాయిలో ఉన్న ఒక అధికారి విశాఖలో సస్పెండ్ కావడం అవమానమేనని సహచర పోలీస్ సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ఆయన అవినీతి, ఆరోపణల్ని ఉన్నతాధికారులు ఆరా తీయాలని బాధితులు కోరుతున్నారు. బదిలీల్లో భాగంగా ఆయన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు సరెండర్ చేసినా కొందరు ఉన్నతాధికారులు, కూటమి నేతల అండతో ఇంకా విశాఖలోనే కొనసాగుతూ మోజెస్ పాల్ అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల్ని మూటకట్టుకున్నారు. మోజెస్ బాటలో విశాఖలో మరికొందరు అవినీతి అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.