విశాఖ పశ్చిమ నియోజకవర్గంపై వైసీపీ దృష్టి
విశాఖ పశ్చిమ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దృష్టి సారించింది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పశ్చిమ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దృష్టి సారించింది. పార్టీ ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికలలో స్వయంకృతాపరాధంతో చేజార్చుకొన్న ఈ నియోజకవర్గాన్ని ఈ పర్యాయం ఎలా అయినా సాధించాలన్న పట్టుదలతో ప్రయత్నాలను ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి మూడో పర్యాయం శాసనసభ్యుడిగా ఎన్నికైన పీవీజీఆర్ నాయుడు (గణబాబు) ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా బలవంతుడైన విశాఖ డెయిరీ చైర్మన్ , రాష్ర్ట ఎంఎస్ఎంఇ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్‌ను బరిలోకి దించింది. గత రెండు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు దాడి రత్నాకర్, మళ్ల విజయప్రసాద్ ల పై గణబాబు విజయం సాధించారు. అప్పుడు ఇప్పడు పోటీపడుతున్న వారంతా గవర సామాజిక వర్గీయులే.
నాలుగో పర్యాయం గణబాబుకు కష్టమేనా?
నాలుగో పర్యాయం విజయం సాధించేందుకు తెలుగు దేశం అభ్యర్థి గణబాబు ప్రయత్నిస్తుండగా ఆనంద్ ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. సహజంగా మూడు పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించడంతో గణబాబు పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఆనంద్ కు అనుకూలంగా మారనుంది. నియోజకవర్గానికి, పార్టీకి ఏమీ చేయని గణబాబుకు ఈ పర్యాయం టికెట్ ఇవ్వొద్దంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మూర్తి యాదవ్ నేతృత్వంలో పలువురు ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
నగర పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ పలు నియోజక వర్గాలకు ఇంచార్జిగా వున్న జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఈ పర్యాయం పశ్చిమ టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభ సమయంలోనూ , పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనూ గణబాబు చురుకుగా వ్యవహరించక పోవడం, మొక్కుబడిగా కార్యక్రమాలు చేయడం ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారిందనే చెప్పాలి. నియోజకవర్గ పరిధిలోని పలువురు తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆనంద్‌కు కలిసి వస్తున్న నేతల పునరాగమనం..
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన మళ్ల విజయ ప్రసాద్‌కు ఈ నియోజక వర్గంలో అనుచరగణం, బంధువులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మూడేళ్ల పాటు స్తబ్ధుగా వున్న ఆయన ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించి యాక్టివ్ అయ్యారు. ఇది ఇప్పుడు ఆనంద్‌కు కలసి వస్తోంది. ఇంతకాలం దూరంగా వున్న మళ్ల వర్గం ఇప్పుడు ఆనంద్ తో కలిసి పనిచేస్తుంది. దాడి రత్నాకర్ ఇటీవలే తెలుగుదేశంతో చేరడంతో ఆయన అనుచరులు మరో ప్రత్యామ్నాయం లేక ఆనంద్‌కు దగ్గరయ్యారు. ఈ పరిణామాల వల్ల పలు వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరికలు పెరిగాయి.