టీడీపీ మాజీ మంత్రికి వైసీపీ బంఫర్ ఆఫర్... ఎంపీగా పోటీకి చాన్స్...!

విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు వైసీపీ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది...

Update: 2024-03-18 10:50 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు వైసీపీ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఈసారి టికెట్ దక్కలేదు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారుకు టీడీపీ విడుదల చేసిన లిస్టులో ఆశాభంగం కలిగింది. పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. దీంతో మనస్థాపంలో ఉన్న బండారుకు వైసీపీ గాలం వేస్తోంది. తమ పార్టీలోకి తీసుకునేందుకు నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ బరిలో దించే యోచనలో  వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండారుతో వైసీపీ నాయకులు టచ్ ఉన్నారనే ప్రచారం సైతం కొనసాగుతోంది.


ఈ పరిణామాలతో బండారు సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి టికెట్ దక్కని వాళ్లతో బండారు సత్యనారాయణ మంతనాలు చేస్తున్నారు. వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం బండారును వైసీపీలోకి వెళ్లొద్దని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని.. అధినేత చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

BREAKING:ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర..అక్కడి నుంచే ప్రారంభం  


Similar News