సీనియర్ల కబంధ హస్తాలలో విశాఖ దేశం..2014 నుంచి ఇదే పరిస్థితి?
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. పది మందిని కలుపుకొని అధికార పార్టీ అరాచకాలు, అన్యాయాలను అడ్డుకోవాలనే భావనే లేదు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. పది మందిని కలుపుకొని అధికార పార్టీ అరాచకాలు, అన్యాయాలను అడ్డుకోవాలనే భావనే లేదు. ద్వితీయ శ్రేణి నేతలను ఎదగకుండా చేయడం ద్వారా తమ హవా కు ఎదురు లేకుండా చేసుకున్నారు. దీంతో విశాఖ జిల్లాలో వారు చెప్పిందే వేదం. చేసేదే కార్యక్రమం. విశాఖ తూర్పు , పశ్చిమ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికైన తెలుగుదేశం నేతలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు ( పీవీఆర్ జీ నాయుడు) లతో పాటు ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుల పరిస్థితి ఇది. నగరంలో పార్టీ పరిస్థితి చూసి ఇటీవల శంఖారావం, యువగళం కార్యక్రమాలకు విశాఖ వచ్చిన యువ నేత నారా లోకేష్ సైతం ఆశ్చర్యపోయే విధంగా వీరి వ్యవహారాలున్నాయి.
పార్టీలో పాతుకుపోయిన ఆ నేతల కారణంగా కొత్త వారెవ్వరూ పార్టీలోకి రావడం లేదు. గతంలో విశాఖ వ్యవహారాలను మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి చేసిన సమయంలో ప్రతి ఎన్నికలప్పుడు పలువురు కొత్త వారు పార్టీలో చేరేవారు. విశాఖ సెటిలర్ సిటీ కావడంతో బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి సంపాదించిన వారు పలువురు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపేవారు. టికెట్ లు ఆశించి భారీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే, పెద్ద నేతలైన వీరు పాతుకు పోవడంతో కొత్త వారికి అవకాశాలు లభించడం లేదు. పార్టీ అధిష్టానం వద్ద వీరిదే హవా కావడంతో చేరికలు పూర్తిగా ఆగిపోయాయి.
ఉత్తర నియోజకవర్గంలో పార్టీ ఉందా?
ఉత్తర నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున కార్యక్రమాలు చేసేందుకు పెద్ద నాయకులు పర్యటనలు చేసేందుకు క్యాడర్ కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ గెలిచింది. అప్పుడు తెలుగుదేశం గట్టిగానే వుంది. అయితే, తెలుగుదేశం తరపున ఆ పార్టీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు 2019లో గెలిచారు. దీంతో పతనం ప్రారంభమైంది. నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసిన ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో రాజీనామా చేశారు. 2024లో అది ఆమోదం పొందినప్పటికీ ఈ నాలుగేళ్లు ఆయన నియోజక వర్గంలోకే వెళ్లలేదు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయోగాలు, వెన్నుపోట్ల కారణంగా వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన గణబాబు ఇక్కడ పార్టీకి శాపంగా మారాయి.
ద్వితీయ శ్రేణి నేతలు ఎదిగితే ప్రమాదం అనే భావనతో వారికి అడ్డుపడ్డారు. పలు పరిశ్రమలు వున్న ఆ నియోజకవర్గంలో ఎల్ జీ వంటి పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగినప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఆయన పెద్దగా స్పందించలేదని విమర్శలు వచ్చాయి. గణబాబు వైఖరికి నిరసనగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఇటీవల రాజీనామా చేశారు.నియోజక వర్గాలలో పాతుకుపోయిన ఆ నేతల కారణంగా తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధి , లోకేష్ తోడల్లుడు భరత్ ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ ఎంపీ సీటును కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి ఆ సీనియర్ ల నిర్వాకమే కారణమనే ఆరోపణలు వచ్చాయి. పరిస్ధితులలో ఇప్పటికీ ఎటువంటి మార్పులు లేవు. పదవుల్లో వుండీ పార్టీ ని పెంచక, పైసా తీయక రాజకీయాలు చేస్తున్న విశాఖ నేతలపై అధిష్టానం ఇకనైనా దృష్టి సారించాలని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కోరుకొంటున్నారు.