విశాఖ చేరుకొన్న భారత ఉప రాష్ట్రపతి..
మిలాన్ - 2024 వేడుకల్లో భాగస్వామ్యం అయ్యేందుకు విశాఖ వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘన స్వాగతం లభించింది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మిలాన్ - 2024 వేడుకల్లో భాగస్వామ్యం అయ్యేందుకు విశాఖ వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ - 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆయన గురువారం ఉదయం 10.22 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జ్ఞాపికను, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, దుస్సాలువా తో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, అడిషనల్ డీజీ (గ్రేహౌండ్స్) ఆర్.కె. మీనా, పోలీస్ కమిషనర్ ఎ. రవిశంకర్, నేవీ కమోడోర్ దిలీప్ సింగ్ తదితరులు ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), జాయింట్ పోలీస్ కమిషనర్ డా. కె. ఫక్కిరప్ప, అడిషనల్ సీపీ ఆనంద్ రెడ్డి, జడ్పీ సీఈవో ఎం. పోలినాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఉదయం 10.31 గం. లకు ఐ.ఎన్.ఎస్. డేగా నుంచి చోళాకు ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు.