విశాఖ దక్షిణలోకి దారేదీ?"
శాసనసభకు పోటీ చేయాలనే లక్ష్యంతో నెల రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవిని వదులుకొని మరీ జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు చుక్కలు కనపడుతున్నాయి.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: శాసనసభకు పోటీ చేయాలనే లక్ష్యంతో నెల రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవిని వదులుకొని మరీ జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు చుక్కలు కనపడుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఓటమి చెందిన ఆయన ఈసారైనా విజయం సాధించాలని వైసీపీలో టికెట్ కష్టమని భావించి జనసేనకు వచ్చారు. వచ్చి రాగానే పార్టీ విశాఖ అధ్యక్షుడిని చేయడంతో పాటు పొత్తులో భాగంగా తీసుకొన్న విశాఖ దక్షిణ నియోజక వర్గానికి అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే, ఇక్కడే సమస్య వచ్చింది. దక్షిణ నియోజకవర్గం తో సంబంధం లేని, తనకు చెందిన యాదవ సామాజిక వర్గం పెద్దగా లేని నియోజకవర్గంలోని వెళ్లే దారే ఆయనకు కనపడడం లేదు. ఒక పక్క సాటి జనసేన నేతలు, కార్యకర్తలు అడ్డుపడుతుండగా, నియోజక వర్గంలో బలంగా వున్న మిత్రపక్షం తెలుగుదేశం అసలు పట్టించుకోవడం లేదు.
పవన్ జిందాబాద్.. వంశీ గో బ్యాక్
దక్షిణ నియోజకవర్గంలో జనసేనకు ఉన్న ముగ్గురు కార్పొరేటర్లు సీటు ఆశించిన వారే కావడంతో వారు ఆయన దగ్గరకు వెళ్లడం లేదు. అందులో ఒకరైన సాదిక్ ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తూర్పులో 50 వేల ఓట్లతో ఓడిపోయిన వంశీ తమకు వద్దని, నియోజక వర్గానికి చెందిన వారిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని సోమవారం స్పష్టం చేశారు. నియోజక వర్గంలో బలమైన మత్స్యకార నేత డాక్టర్ మూగి శ్రీనివాస్ ఆయనతో చేతులు కలిపి జనసేనకు కట్టుబడి ఉంటామని, వంశీకి మాత్రం చేయమని కుండబద్దలు కొట్టారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు భీశెట్టి వసంత లక్ష్మి, నాగరాజులు వంశీకి అభినందనలు చెప్పి ఆహ్వానించకుండా మౌనంగా, దూరంగా వున్నారు.
జనసేన ముద్దు.. వంశీ కృష్ణ వద్దు
నియోజక వర్గంలోని జనసైనికులు మరో అడుగు ముందుకేసి మంగళవారం ఏకంగా వంశీ ఫొటోలను తగలబెట్టారు. వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగి వంశీ టికెట్‌ను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేశారు. ఇప్పటి వరకు మొహం కూడా తెలియని వంశీని తమ అభ్యర్థిగా పెడితే ఎలా అని, జనసేనను నమ్మి ఇంత కాలం పనిచేసిన స్థానికులకే సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ‘జనసేన ముద్దు.. వంశీ కృష్ణ వద్దు’ అంటూ వంశీ చిత్ర పటాలకు ఇంటూ మార్కులు పెట్టి దగ్ఢం చేశారు.
తెలుగుదేశం మద్దతు లేదాయే..
దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున రెండో పర్యాయం గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో పెందుర్తికి చెందిన గండి బాబ్జీని తీసుకొచ్చి ఇన్‌చార్జిగా నియమించారు. బాబ్జీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజక వర్గంలో గట్టిగా పనిచేసి విశాఖ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి మంచి నియోజకవర్గంగా తయారు చేశారు. అయితే పొత్తులో సీటు ఆయనకు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులంతా షాక్ లోకి వెళ్ళిపోయారు. వంశీని తెలుగుదేశం తరపున నియోజకవర్గంలో తిప్పేవారు కానీ, ఆయన వెంట నడిచే వారు కానీ లేకుండా పోయారు. దీంతో వంశీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.