అనకాపల్లిలో అనూహ్య పరిణామం.. దాడి ఇంటికి కొణతాల
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు...
దిశ ప్రతినిధి, అనకాపల్లి: రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరో మాజీమంత్రి, తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. దాడి తెలుగుదేశంలో కొణతాల కాంగ్రెస్‌లో చాలా కాలం ప్రత్యర్ధులుగానే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకొన్నారు. ఒక దశలో ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ మాటలు, పలకరింపులు లేకుండానే కాలం గడచిపోయింది.
2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయగా, కొణతాల సోదరుడు రఘునాధ్ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ తరువాత వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఆశించి తెలుగుదేశంలోకి వెళ్లగా, కొణతాల జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించడంతో రాజకీయ విబేధాలను పక్కనపెట్టి దాడి వీరభద్రరావు ఇంటికి కొణతాల శుక్రవారం ఉదయం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన మద్దతు కోరారు. రాజకీయాలలోకి రాకముందు కొణతాల కుటుంబానికి చెందిన అనకాపల్లి ఏఏంఎల్ కళాశాలలో దాడి వీరభద్రరావు అధ్యాపకుడిగా పని చేశారు.