రుషికొండ బీచ్ సౌత్ రోడ్డు ప్రారంభం.. పర్యాటకుల ప్రయాణానికి మరింత సౌకర్యం
వైసీపీ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మూసేసిన రుషికొండ దక్షిణ రోడ్డు తిరిగి అందుబాటులోకి వచ్చింది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మూసేసిన రుషికొండ దక్షిణ రోడ్డు తిరిగి అందుబాటులోకి వచ్చింది. రుషికొండ బీచ్ దక్షిణం వైపు రోడ్డును గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించారు. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంపీ శ్రీభరత్ చొరవతో మరమ్మతులు చేపట్టి సోమవారం ఈ రోడ్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ రోడ్డు పునఃప్రారంభంతో రుషికొండకు వచ్చే పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు గణనీయమైన ఊరట లభించనుంది.
ప్యాలెస్ కోసం రోడ్డును మూసేశారు..
గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును కేవలం ఒక ప్యాలెస్ అవసరాల కోసం మాత్రమే వినియోగించారు. దీంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, మరమ్మతులు చేపట్టి తిరిగి ఈ రోడ్డును ప్రజల ఉపయోగం కోసం అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.
పర్యాటక అభివృద్ధికి తోడ్పాటు..
ఈ దక్షిణ వైపు రోడ్డు పునఃప్రారంభం రుషికొండ పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి మరింత ఊతం అందిస్తుంది. రద్దీ తగ్గడంతో పాటు బీచ్ సందర్శించే వారి అనుభవం మరింత ఆనందదాయకంగా మారనుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు , వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డిఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎపీ సీఓఎస్‌జీఎల్‌ఎఫ్ ఛైర్మన్ గండి బాబ్జీ , ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.