ఎన్నికల బరిలో వారసుడు.. ఆ స్థానం కోసం దరఖాస్తు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు సంక్రాంతి సందర్భంగా మససులోని మాట బయటపెట్టారు. ..
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు సంక్రాంతి సందర్భంగా మససులోని మాట బయటపెట్టారు. తన వారసుడిని లైన్‌లో పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు ఆయన కుమారుడు ఎవరు.. ఎక్కడి నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన చింతకాయల అయ్యన్న పాత్రుడు పలుమార్లు మంత్రిగా పని చేశారు. ఓ మారు ఎంపీగా గెలిచారు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం, అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేశారు. 2019లోనూ ఆయన నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తన వయసు రీత్యా వారసుడు చింతకాయల విజయ్‌ను ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో ఆయన్ను భాగస్వామ్యులను చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయించారు. తండ్రి అయ్యన్న పాత్రుడిపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగినప్పుడు చింతకాయల విజయ్ అండగా నిలిచారు. దీంతో ఆయనపైనా పలు కేసులు నమోదు అయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సీఎం జగన్‌పై ఎక్కుపెట్టిన బాణంలా విరుచుకుపడ్డారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు చింతకాయల విజయ్ సంఘీభావం తెలిపారు. లోకేశ్‌తో కలిసి పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీంతో లోకేశ్‌తో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది. ఈ మేరకు 2024 ఎన్నికల్లో చింతకాయల విజయ్‌ను పోటీ చేయించాలని తండ్రి అయ్యన్న పాత్రుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసత్వాన్ని విజయ్ కొనసాగిస్తారని తెలిపారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని చెప్పారు. తన వారసత్వాన్ని చింతకాయల విజయ్ కొనసాగిస్తారని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశామని చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మరి అయ్యన్న అభ్యర్థన మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.