పాయకరావుపేట వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వివాదం
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి....
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ నేత కంబాల జోగులుకు టికెట్ ఇవ్వొద్దని అమ్మాజీ వర్గీయుల డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు కూడలిలో ధర్నా నిర్వహించారు. కంబాల జోగులుకు సీటు ఇస్తే ఓడిస్తామని అమ్మాజీ వర్గీయులు హెచ్చరించారు. జోగులుకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా తాము మద్దతిస్తామని చెప్పారు. అవసరమైతే పార్టీని వీడతామని హెచ్చరించారు.
కాగా పాయకరావుపేట వైసీపీ ఇంచార్జిగా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో కబాల జోగులు నాన్ లోకల్ అని అమ్మాజీ వర్గం ఆరోపిస్తోంది. లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని అమ్మాజీ వర్గం డిమాండ్ చేస్తోంది.