Visakha: పొత్తులు, సీఎం పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి యాత్ర విశాఖలో ముగిసింది...
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి యాత్ర విశాఖలో ముగిసింది. దీంతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పొత్తులు, సీఎం పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-జనసేన, జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పడొచ్చని పవన్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వమని పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎం పదవిపై కూర్చునేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అందుకు ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలబడాలని కోరారు. అధికారంలోకి వస్తే వైసీపీ చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయంతోనే సీఎం పదవి తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీ సంస్థాగత నిర్మాణంపై సలహాలివ్వడానికి వైసీపీ వాళ్లెవరని ప్రశ్నించారు. తమ పార్టీ నిర్మాణం.. తమ ఇష్టం మేరకే ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్రిమినాలిటీని లీగలైజ్ చేశారని పవన్ మండిపడ్డారు. రాయలసీమలో దోపిడీ కానందనే ఉత్తరాంధ్రపై పడ్డారని ధ్వజమెత్తారు. ప్రతి పనికి వసూళ్ల చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. గ్రీన్ ట్యాక్స్ వేస్తూ వేల రూపాయలు దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.