ఆర్ఓబీ నిర్మాణానికి మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన..
జిల్లాలోని ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంగ్లాం, చుక్కవానిపాలెం, కాపు తుంగ్లాం, గొల్ల జగ్గరాజుపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కల నెరవేరనుంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జిల్లాలోని ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంగ్లాం, చుక్కవానిపాలెం, కాపు తుంగ్లాం, గొల్ల జగ్గరాజుపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కల నెరవేరనుంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం ఈ ఆర్.ఓ.బి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు 16 కోట్ల రూపాయల సేతు బంధన్ స్కీమ్ నిధులతో ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు
ఈ ఆర్ ఓబీ కి సంబంధించిన రైల్వే శాఖ తన పరిధిలోని ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన పనులు పూర్తి చేసింది. ఇప్పుడు 16 కోట్ల రూపాయల వ్యయంతో మిగిలిన పనులు పూర్తి చేస్తుందని, మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని, అలాగే ఈ నిర్మాణ సమయంలో స్థానికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి అమర్నాథ్ హామీ ఇచ్చారు.ఈ నిర్మాణానికి అవసరమైతే ఏపీఐఐసీ విధులు కూడా వెచ్చిస్తామని అమర్నాథ్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా అనకాపల్లి, అనంతపురం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత, గాజువాకలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. కాగా విశాఖ నగరంలో సుమారు 11 ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన డి.పి.ఆర్ సిద్ధమైందని త్వరలోనే ఈ నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్చార్జి ఊరుకునే చందు, స్థానిక కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.