Visakha: అక్కడికి వెళ్లి ఏం చేయగలిగారు.. పవన్‌కు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2023-08-14 14:01 GMT

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విసన్నపేట భూములపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌పై విమర్శలు చేయడం తప్ప పవన్ కల్యాణ్ విస్సన్నపేటలో పర్యటించి ఏం చేయగలిగారని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. విసన్నపేట భూములకు, ఉపాధికి సంబంధం ఏంటన్నారు. సినీ మోజుతో ఉన్న యువతను పవన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో జరిగిన భూ దందాలపై ప్రభుత్వం సిట్‌తో విచారణ చేయించిదని, ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. మొత్తం 76 మందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విసన్నపేటలోని భూములను ఆయన పరిశీలించారు. మంత్రి అమర్‌నాథ్ అనుచరులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. అంతేకాదు అమ్ముకునేందుకు లే అవుట్ కూడా వేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు విసన్నపేటలో దళితుల భూములను కూడా వదలిపేట్టలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, దళిత భూములను అభివృద్ధి చేస్తే సరేనని.. కానీ వెంచర్లు వేసి అమ్ముకుంటేనే పద్ధతి కాదని హెచ్చరించారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి భూములను విధ్వంసం చేశారని పవన్ వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు కబ్జా చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఇలా చేస్తేనే వాళ్ల అక్కడి నుంచి ఆంధ్రావాళ్లను తరిమేశారని చెప్పారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మంత్రులు చేస్తున్న దోపిడీపై సీఎం జగన్ చెప్పాల్సిందేనని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Read More : Pawan: ఆ 600 ఎకరాల భూ కబ్జాపై సీఎం సమాధానం చెప్పాల్సిందే..!


Similar News